
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో సన్ ఫార్మాకు రూ.1,984 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రూ.2,277 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అన్ని మార్కెట్లలో సేల్స్ పెరగడంతో ప్రాఫిట్ పెరిగిందని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. కొన్ని ఐటెమ్స్‌ను అడ్జెస్ట్ చేశాక కంపెనీ నికర లాభం (స్టాండ్ ఎలోన్ )క్యూ4 లో రూ.2,156 కోట్లుగా నమోదయ్యింది. కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చిన రెవెన్యూ కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రూ.9,447 కోట్లుగా ఉండగా, తాజా క్యూ4 లో రూ.10,931 కోట్లకు ఎగిసింది. మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సన్ ఫార్మాకు రూ.8,474 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ రూ.3,273 కోట్లుగా ఉంది. ఆపరేషనల్ రెవెన్యూ రూ. 38,654 కోట్ల నుంచి రూ.43,886 కోట్లకు ఎగిసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ.4 ఫైనల్ డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది. ఇండియా, ఇతర ఎమెర్జింగ్ మార్కెట్లలో తమ అన్ని బిజినెస్‌లు మంచి ప్రోగ్రెస్‌ను నమోదు చేశాయని సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. స్పెషాలిటీ బిజినెస్ గ్రోత్ బాటలో ఉందని, ఈ బిజినెస్‌ను మరింత విస్తరించడంపై ఫోకస్ పెడుతున్నామని వివరించారు. కంపెనీ షేరు శుక్రవారం 2.75 శాతం లాభంతో రూ.971 వద్ద సెటిలయ్యింది.