ఇంటింటి ప్రచారం చేస్తలే..మాస్‌‌‌‌ క్యాంపెయినింగ్‌‌‌‌కే క్యాండిడేట్ల మొగ్గు

ఇంటింటి ప్రచారం చేస్తలే..మాస్‌‌‌‌ క్యాంపెయినింగ్‌‌‌‌కే క్యాండిడేట్ల మొగ్గు
  •     తక్కువ టైంలో ఎక్కువ మందిని కలవడం, ఖర్చు తగ్గింపుపై ఫోకస్‌‌‌‌
  •     ఎండ తీవ్రత కారణంగా పొద్దున గ్రౌండ్లు, పార్కుల్లో ప్రచారం
  •     సాయంత్రం రోడ్‌‌‌‌షోలు, కార్నర్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లకు హాజరు

ఖమ్మం, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల ప్రచారానికి టైం తక్కువ ఉండడంతో పాటు, ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో అన్ని పార్టీల క్యాండిడేట్లు క్యాంపెయినింగ్‌‌‌‌ వ్యూహాలను మార్చేస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని బంద్‌‌‌‌ చేసి, ఒకే సారి ఎక్కువ మందిని కలిసేలా కులాల వారీగా సమావేశాలు, రోడ్‌‌‌‌షోలు, కార్నర్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లు వంటి ప్రచార కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. అలాగే ఖర్చు తగ్గించుకోవడంపై కూడా ఫోకస్‌‌‌‌ పెడుతున్నారు. మరో వైపు ఉన్న టైంలోనే అన్ని నియోజవర్గాలు కవర్‌‌‌‌ చేయాలన్న లక్ష్యంతో క్యాండిడేట్ల కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఉదయం పార్క్‌‌‌‌కు.. సాయంత్రం రోడ్‌‌‌‌షోకు

ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ఉదయం, సాయంత్రం తప్ప మధ్యాహ్నం టైంలో కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో క్యాండిడేట్లు సైతం ఇందుకు అనుగుణంగా తమ ప్రచార కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా వాకింగ్ చేస్తున్న వారిని కలిసేందుకు ఉదయమే పార్కులు, గ్రౌండ్లకు, స్టేడియాలకు పరుగులు తీస్తున్నారు. తర్వాత రైతులు, కూలీలు, కార్మికులను డైరెక్ట్‌‌‌‌గా కలిసేందుకు మార్కెట్లకు వెళ్తున్నారు. అప్పటికే ఎండ తీవ్రత పెరగడంతో బయట ప్రోగ్రామ్స్‌‌‌‌కు వెళ్లడం లేదు. 

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏసీ ఫంక్షన్స్‌‌‌‌ హాల్స్‌‌‌‌లో మీటింగ్స్‌‌‌‌ పెడుతున్నారు. సాయంత్రం మళ్లీ ఎండ తీవ్రత తగ్గగానే రోడ్‌‌‌‌షోలు, కార్నర్‌‌‌‌  మీటింగ్‌‌‌‌లతో పాటు చిన్నచిన్న సమావేశాలకు అటెండ్‌‌‌‌ అవుతున్నారు. ఒక పార్లమెంట్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండడంతో పూటకో నియోజకవర్గం చొప్పున అన్ని నియోజకవర్గాలు కవర్‌‌‌‌ అయ్యేలా ప్లాన్‌‌‌‌ చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి రెండు వారాలు కూడా సరిగా లేదు. దీంతో టైం మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు, ఖర్చు తగ్గింపుపై క్యాండిడేట్లు ఫోకస్‌‌‌‌ చేశారు. 

అన్ని మండలాలు, గ్రామాల్లో కార్యకర్తలతో టీమ్‌‌‌‌లను ఏర్పాటు చేసి రెగ్యులర్‌‌‌‌గా ఇంటింటి ప్రచారం చేయడం ఖర్చుతో కూడుకున్న పని. ఇలా ప్రతి రోజు వేలాది మందిని మెయింటేనే చేయాలంటే క్యాండిడేట్లు భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రతి పార్లమెంట్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ పరిధిలో 50 నుంచి 60 మండలాల్లో 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఓటర్లను డైరెక్ట్‌‌‌‌గా కలవడలం తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో తక్కువ మంది కార్యకర్తలు, తక్కువ ఖర్చుతో ప్రచారం చేసేలా క్యాండిడేట్లు ప్లాన్‌‌‌‌ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆటోలు, మినీ వ్యాన్‌‌‌‌లకు ఫ్లెక్సీలు కట్టి, సౌండ్‌‌‌‌ బాక్స్‌‌‌‌లు ఏర్పాటు చేసి గ్రామాల్లో తిప్పుతున్నారు. మరో వైపు ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను చేర్చుకోవడంపైనా దృష్టి పెట్టారు. ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకం ఉన్న క్యాండిడేట్లు మాత్రం కాస్త ధైర్యంగా పైసలు ఖర్చు చేస్తుండగా, మిగిలిన వారు మాత్రం ముందు వెనకా ఆలోచించి ఖర్చు పెడుతున్నారు.

ప్రచారంలో కుటుంబ సభ్యులు

టికెట్‌‌‌‌ కన్ఫర్మ్‌‌‌‌ అయిన క్యాండిడేట్లు సైతం ఎలక్షన్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ వచ్చే వరకు ప్రచారంపై ఫోకస్‌‌‌‌ చేయలేదు. ఎన్ని రోజులు ప్రచారం చేస్తే అంత ఖర్చు పెరుగుతుందన్న ఉద్దేశంతో వీలైనంత వరకు ఆలస్యం చేస్తూ వచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ వచ్చిన తర్వాత సభలు, కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలపై నజర్ పెట్టారు. ఇక చివరి నిమిషం వరకు బీ ఫామ్‌‌‌‌ దక్కించుకోవడం కోసం హైకమాండ్‌‌‌‌ చుట్టూ తిరిగిన క్యాండిడేట్లు తమకు సరిపడా సమయం లేదంటూ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. 

ముఖ్య అనుచరులు, నమ్మకస్తుల్లో కొందరిని తమ వెంట తిప్పుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులను సైతం ప్రచార రంగంలోకి దించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగిన లీడర్లతో కలిసి క్యాండిడేట్‌‌‌‌ భార్య, కుమారుడు, కుమార్తె, అన్న, తమ్ముడు ఇలా ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ మొత్తం తలా ఓ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇక అభ్యర్థులు కూడా ప్రచారానికి వెళ్లిన టైంలో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లతో కలిసి గేమ్స్​ఆడడం, బస్తాలు మోయడం, ఇస్త్రీ చేయడం, దోశలు వేయడం వంటి పనులు చేస్తున్నారు.