న్యూఢిల్లీ: జింబాబ్వేతో వన్డే సిరీస్ మొదలుకాకముందే.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చాలా రోజుల తర్వాత టీమ్‌లోకి వచ్చిన ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్.. ఎడమ భుజం గాయంతో జింబాబ్వే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతని ఇంటర్నేషనల్ రీ ఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. రాయల్ లండన్ కప్ వన్డే చాంపియన్‌షిప్‌లో లాంక్‌షైర్‌కు ఆడుతున్న సుందర్.. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో ఈ నెల 18న మొదలయ్యే సిరీస్‌కు అతను అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశాడు. ‘అవును, సుందర్ జింబాబ్వే సిరీస్‌కు దూరమయ్యాడు. రాయల్ కప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో అతని ఎడమ భుజానికి గాయమైంది. లాంక్‌షైర్, వార్సిష్టర్‌షైర్ మధ్య మ్యాచ్‌లో ఇది జరిగింది. అతను రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లనున్నాడు. గాయంపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం’ అని సీనియర్ అధికారి వెల్లడించాడు. గత ఏడాది కాలంగా వివిధ రకాల గాయాలతో ఇబ్బందిపడుతున్న ఈ తమిళనాడు స్పిన్నర్ చాలా సిరీస్‌లకు దూరమయ్యాడు. ‘సుందర్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. కానీ అతనిలో చాలా నైపుణ్యం ఉంది. దురదృష్టంకొద్దీ సిరీస్‌లు మిస్ అవుతున్నాడు. ఈ విషయంలో కొద్దిగా అదృష్టం కూడా కావాలి. మరో వారంలో ఇండియాకు ఆడుతున్నాడని అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఈ గాయమైంది’ అని సదరు అధికారి పేర్కొన్నాడు. 2021 జులైలో వేలి ఫ్రాక్చర్‌తో మొదలైన గాయాల బెడద సుందర్‌ను వీడటం లేదు. డొమెస్టిక్ సీజన్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. తర్వాత కొవిడ్ బారిన పడి కోలుకున్నాడు. ఆ తర్వాత కాలిపిక్క కండరాల గాయంతో ఫిబ్రవరి, మార్చిలో వెస్టిండీస్, శ్రీలంకతో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇక ఐపీఎల్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడలేదు. రిహాబిలిటేషన్ తర్వాత బీసీసీఐ పర్మిషన్‌తో కౌంటీల్లో ఆడాడు. చివరకు టీమ్‌లోకి వచ్చే టైమ్‌లో మళ్లీ భుజం గాయంతో వెనక్కి వచ్చేస్తున్నాడు.
టీమిండియా ప్రాక్టీస్ ముమ్మరం
సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న టీమిండియా.. ఆ తర్వాత ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఆదివారం ట్రెయినింగ్‌కు డుమ్మా కొట్టిన కెప్టెన్ కేఎల్ రాహుల్.. సోమవారం పూర్తి స్థాయి నెట్ సెషన్‌లో పాల్గొన్నాడు. 30 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన కేఎల్ మంచి టచ్‌లో కనిపించాడు. ఈ సెషన్‌ను చీఫ్ కోచ్ లక్ష్మణ్ పర్యవేక్షించాడు. బౌలర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన వీవీఎస్.. కొన్ని టిప్స్ ఇచ్చాడు. ముఖ్యంగా దీపక్ చహర్ బౌలింగ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.
