ఫిజిక్స్‌లో సున్నా వచ్చిన యువతి.. ఇన్‌స్పైరింగ్ ట్వీట్‌కు పిఛాయ్ ఫిదా

ఫిజిక్స్‌లో సున్నా వచ్చిన యువతి.. ఇన్‌స్పైరింగ్ ట్వీట్‌కు పిఛాయ్ ఫిదా

నాలుగేళ్ల క్రితం క్వాంటమ్ ఫిజిక్స్‌లో సున్నా మార్కులు వచ్చిన యువతి.. నేడు అంతరిక్షంపై అధ్యయనం చేస్తోంది. జీరో వచ్చిన నాడు భయంతో సబ్జెక్ట్ మార్చుకోవాలని రెడీ అయింది. ప్రొఫెసర్ ఇచ్చిన ధైర్యంతో నేడు అస్ట్రోఫిజిక్స్‌ (నక్షత్రాలు, గ్రహాలపై స్టడీ)లో పీహెచ్‌డీ పూర్తి చేసింది. తన రీసెర్స్ పేపర్లను ప్రముఖ సైన్స్ జర్నల్స్‌ పబ్లిష్ చేశాయి. మార్కులు ముఖ్యం కాదు.. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించొచ్చని గట్టిగా చెబుతోంది. ప్రతిభ ఉండి.. కష్టపడితే విజయం మనదేనని నలుగురిలో స్ఫూర్తి నింపుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యువతి సారాఫినా నాన్సీ ఇన్‌స్పైరింగ్ స్టోరీ ఇదీ. ప్రతిభకు మార్కులు కొలబద్ద కాదని చెబుతూ ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. తాను నాలుగేళ్ల క్రితం తన సబ్జెక్ట్ మార్చుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని చెబుతూ ట్వీట్ చేసింది.

సుందర్ పిఛాయ్ ఫిదా

నాన్సీ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అవును ప్రతిభకు మార్కులు కొలమానం కాదు అంటూ చాలా మంది తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిఛాయ్ కూడా ఆమె ట్వీట్‌కు స్పందించారు. ఇన్‌స్పైరింగ్ అంటూ మెచ్చుకున్నారు. మంచిగా చెప్పారు.. చాలా స్ఫూర్తిదాయంగా ఉంది అంటూ ఆమె పోస్ట్‌ను రీట్వీట్ చేశారు పిఛాయ్. చాలా మంది రీసెర్చర్లు, ప్రొఫెసర్లు ఆ ట్వీట్‌పై స్పందించారు. శనివారం వరకు 15600 మంది రీట్వీట్ చేయగా, 84 వేల మంది లైక్ కొట్టారు.