దొర తల్లి సచ్చిపోయింది. కాదు కాదు పరమపదించింది. మామూలోల్లు అయితే సచ్చిపోతరు. పెద్దపెద్దోల్లు ఎక్కడైనా సచ్చిపోతారా?! మరణిస్తారు. పరమపదిస్తారు. ఇంకా మాట్లాడితే నింగికి, దిగంతాలకు, దివికి ఏగుతరు. ఇదీ ఎక్కడైనా లెక్క!
దొర తల్లి సచ్చిపోతే దొరకు గుండెల్ల రాయిపడ్డట్టయ్యింది. తల్లి సచ్చిపోతే ఎవ్వలకైనా ఏడుపు తన్నుకరావాలె. పుట్టెడు దుఃఖం రావాలె. కానీ, దొరకు మాత్రం అట్లా ఏదీ రాలేదు. ‘సావు చేసుడు ఎట్లా?’ అనే దిగులు పట్టుకున్నది. సావు చేయడానికి దొర దగ్గర పైసలు లేవా అంటే బొచ్చెడున్నయి. భూములు, జాగలు, ఆస్తులు, అంతస్తులు మస్తున్నయి. కాకుంటే లేనిది ఒక్కటే. ఆ ఒక్కదాని గురించే దొర రగిలిపోతున్నడు. వారం రోజులుగా దొర నిమ్మలంగ లేడు.
ఊళ్లె పట్టపగటీలి పిట్ట కుయ్యిమంటలేదు. పెద్ద కరువో, గత్తరనో వచ్చి ఊరంత ఖాళీ చేసిపోయినట్టున్నది. నాలుగైదు రోజులసంది ఊళ్లె ఏ క్షణాన ఏ గొడవ జరుగుతదో అర్థం అయితలేదు. భూమికి భూమధ్య రేఖ ఉన్నట్టు ఊరికి, వాడకు మధ్య సీసీ రోడ్డున్నది. ఊరంత పరుచుకున్న సీసీ రోడ్డు, సరిగ్గా ఎస్సీ కాలనీ దగ్గరికి వచ్చేసరికే అలిగినట్టుంది. ఎస్సీ కాలనీకి యేండ్ల తరబడి మట్టిబాటే దిక్కయ్యింది.
ఎండ మండుతంది. ఎండకంటే ఎక్కువ ఊళ్లె రాజకీయాలు మండుతున్నాయి. అందుకే యిండ్లు వదిలిపెట్టి మాదిగలంతా పోశమ్మ గుడికాడున్న చింత సెట్టుకింద పోగైన్రు. ‘‘నువ్వు ఎన్నైనా చెప్పురా, ఇయ్యాల మాత్రం ఊరో, మనమో తేలిపోయే రోజొచ్చింది’’ అన్నడు మైదమోళ్ల మల్లేషు. ‘‘లేకపోతేందిరా నీ యవ్వ ఎంతకాలమని వాళ్ల కాళ్లకింద బతకాలె’’ కొసింటి రాజాలు గొంతుకలిపిండు. నేనేమన్న తక్కువ తిన్ననా అన్నట్టు జంగిలి సామి కూడా లేసిండు. ‘‘వాళ్లకు మనమంటేనే గిట్టదు. ఓర్వరు. నీయవ్వ. దేశానికి రాజ్యాంగం రాసిన పెద్దమనిషి విగ్రహం వద్దంటారు. ఇంతకంటే అజ్ఞానముంటదా’’ అని చేతిలున్న కట్టెపుల్లను నేలకేసి కొట్టిండు.
రాయమల్లు, చంద్రు మాత్రం పెద్దమనుషులు కాబట్టి ఎవలెవలు ఏమంటరో ఇందామనుకున్నట్టు సప్పుడు చేస్తలేరు. పడుసుపోరగాండ్ల లెక్క తొందరపడొద్దనుకుంటున్నరు. ఊరి సంగతులన్నీ వాళ్లకు తెలిసినయే. జన్ను కట్టమల్లు లేసి ‘‘నీయవ్వ పుట్టేది ఒకనాడే, సచ్చేది ఒకనాడే. ఎటైతే అటాయే ఊళ్లె నాలుగు బాటల కాడ విగ్రహం పెట్టేదాకా మన తడాఖేందో సూపెట్టాల’’ని బరిగీసిండు. బండల మీద కూసున్న సోర పోరగాళ్లకు నెత్తురు మసులుతంది. అందరి ఆవేశం చూసి, అందరిట్ల జెర అచ్చరం అబ్బినోడు, పట్నం దాక పోయి పెద్ద సదువులు సదివినోడు, ఇరవై ఐదు ముప్పయి యేండ్లకే అరవైయేండ్ల అనుభవం కలిగిన యువకుడు సోమేషు నోరిప్పిండు.
‘‘ఇగో తాత నేను ఒక ముచ్చట చెప్త, జెర అందరు చెవు పెట్టి ఇనున్రి’’ అన్నడు. ఏదో మంచిమాట, ముఖ్యమైన ముచ్చట చెప్పబోతున్నడని ఆ చింతచెట్టు కింద కూసున్న ముప్పయి మంది దాకా చెవులు రిక్కించిన్రు. ‘‘ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం మామూలుది కాదు. మన బతుకులే కాదు, ఈ దేశం ఇట్ల ఒక పద్ధతిగా ఉండనీకి దారులేసిన జాతీయనేత అంబేద్కరంటే. ఆయనే లేకపోతే ఎప్పటి సిప్ప ఎనుగుల్లే అన్నట్టు ఉండేది. అసొంటి పెద్ద మనిషి విగ్రహం నాలుగు బాటల కాడ పెడతమంటే వీళ్లకేం నొప్పి. అందుకే ఇగ మనం వాళ్లకు ఎసొంటి సాకిరి చెయ్యొద్దు.
ఇగో మా ఎలిషన్న తాత చెప్పులు కుట్టి యేండ్లకేండ్లు వాళ్లకు సేవ చేసిండు. ఆయనకేం ఒరిగింది. ఎక్కడేసిన బతుకు అక్కడ్నే ఉన్నది. కాలం మారింది. మనదాంట్లె గూడ సదువుకుంటున్నోళ్లు ఉన్నరు. మనం చేసే పనులను బట్టే మనకు ఇలువను ఇస్తరు. ఈ దేశంల చెప్పులు కుట్టెటోళ్లంటే, డప్పులు కొట్టెటోళ్లంటే లెక్కలేదు. గందుకే గిప్పుడన్న మన దమ్మేందో సూపిద్దాం. అందరం ఒక్కతాటి మీద ఉందాం. వాళ్ల సెలకలల్లకు కూలికి పోవద్దు. వాళ్లకు జీతం చెయ్యొద్దు. ముఖ్యంగా వాళ్ల మనుషులు సచ్చిపోతే మనం డప్పులు కొట్టద్దు. కాష్టం పేర్వొద్దు. బొందలు తియ్యొద్దు’’ అని కుండబద్దలు కొట్టిండు సోమేషు. మంచి మాట చెప్పిండు తమ విలువేందో చూపిండన్నట్టు అందరు సప్పట్లు కొట్టిన్రు.
మాదిగపెద్దమనుషులు కూడా అవునన్నట్టు తలూపిన్రు. సోమేషు ఉస్మానియా యూనివర్సిటీల సదువుకొని వచ్చినోడు. ఈ బతుకులు మారాలని తన శక్తి మేరకు తండ్లాడుతున్నోడు. సదువుతోటే బతుకులు మారుతయని గుడిసె గుడిసెకు తిరిగి చెప్పుతుంటడు. అందుకే సోమేషన్న, సోమేషు మాటన్న మాదిగ్గూడెంల అందరికీ గౌరవమే. ఎనుకట ఉన్నట్టు లేదు గూడెం. సోమేషులాంటోళ్ల వల్ల జెర జెర తెలివికొస్తున్నరు. ఇప్పుడు ఊరంతా ఊపిరి బిగపట్టి చూస్తున్నది. మాదిగలు ఏం చేస్తరో సూద్దామనుకుంటున్నది.
సిమెంటు రోడ్డుకు ఇవుతల ఉన్న సూదరి ఇండ్లల్ల ఉన్న ఒకే ఒక్క భవంతి ఊరి దొర రామేశ్వరరావుది. ఎప్పుడూ కళకళలాడిన బంగ్లా, ఇవాళ దివాళ తీసింది. కారణం దొర తల్లి సచ్చిపోయింది. పట్నం నుండి దొర కొడుకు కోడలు, మనమండ్లు, మనుమరాండ్లు, సుట్టాలు పక్కాలు అందరు వచ్చిన్రు.
సావు కార్యం జరిపించాలే. కానీ, డప్పులు కొట్టెటోళ్లు లేరు. రామేశ్వరరావుకు మొదటిసారి కష్టమొచ్చిపడ్డది. కంటిసూపుతోటి పనులు చక్కపెట్టే పెద్దిర్కం ఇప్పుడు పనికి రాకుంట అయ్యింది. ‘‘అయినా వాళ్లకు అంత పొగరేంది. దొర మాటకు ఎదురు చెప్పెటోళ్లు అయ్యిన్రా’’ అన్నడు తిరుపతిరెడ్డి. ‘‘ఇప్పుడేందే వాళ్లది మొదటి నుండి అదే పోకడ, తన్నెటోడు లేక విర్రవీగుతున్నరు’’ అన్నడు రంగారావు పటేల్. ‘‘ఇంతమందిమి ఉంటిమి వాళ్లను తొవ్వకు తేలకపోతిమి? ఏ ఫాయిదా’’ అన్నడు దొరకు ప్రధాన అనుచరుడు ఏకాంబ్రం. రామేశ్వరరావు దొరకు మాత్రం వచ్చిన సుట్టాలు బలగం ముందు ఇజ్జతిపోతున్నట్టు అనిపిస్తంది. అసలు తన తల్లి సచ్చిపోయిన బాధకంటే మాదిగోళ్లు ‘‘డప్పులు కొట్టడానికి మేమురాము’’ అన్న సవాలే లోలోపల రగులుతంది. ఏం చెయ్యాలే. ఎట్లా చెయ్యాలే. నాలుగు బాటల కాడ ఒక ఎస్సీ విగ్రహం ఎందుకు పెట్టించాలే అని తన అనుచరులతో అంటనే ఉన్నడు. అదే ఇప్పుడు ఇంత పనికొస్తదని తాను ఊహించలేకపోయాడు.
రామేశ్వర్‌రావు అంటే ఊళ్లె అందరికి హడల్. రామేశ్వర్‌రావు తండ్రి భూపతిరావు కాలం ఇట్లా లేకుండే, దొర గడి ముందు నుండి నడుచుకుంటు పోవాలంటేనే చెప్పులు చేతుల పట్టుకొని పోయిన రోజులు. దొర మాటకు ఎదురు చెప్తే ప్రాణాలు గాలిల కలసిపోయేటివి. కనిపించిన భూములు, కంటికి నచ్చిన ఆడమనిషిని భూపతిరావు వదిలిందే లేదు. ఆయిన ఎంతంటే అంతే. అట్లా నడిచిన రోజులు పోయినయి.ఇప్పుడు రామేశ్వర్‌రావు వంతు వచ్చింది. మారిన కాలాన్ని బట్టి తాను కూడా పంథా మార్చుకున్నడు. మంచోడేం కాలేదు. కానీ, ఊరిపైన ఎట్లా తన పట్టుని కాపాడుకోవాలో అట్లా మసులుకుంటడు. అన్ని తీర్ల ఏషమేస్తనే ఉన్నడు. బయటికి మంచోనిలా కనిపిస్తు భూపతిరావు గుణగణాలకు అసలు సిసలు వారసునిగానే బతుకుతున్నడు.
ఈ విగ్రహం ముచ్చట తనదాక రాంగనే రామేశ్వర్‌రావు, ముందు ఊళ్లె ఉన్న బీసీలను పిలిచి రహస్యంగా మీటింగ్ పెట్టిండు. ‘‘సూడున్రి ఊళ్లో మనం పొద్దుపొద్దుగాల ఒక హరిజన్సోని మొఖం సూడాల్నా, ఎంత అరిష్టం’’ అన్నడు.‘‘అదేంది దొర, అట్లెట్ల ఒప్పుకుంటం’’ అన్నరు. ‘‘మరి ఎస్సీ కాలనీల ఉన్నోళ్లకు చెప్పున్రి. వాళ్లను విగ్రహం వాళ్ల కాలనీలనే పెట్టుకొమ్మనున్రి’’ అన్నడు.నిమిషాల మీద వార్త ఊరంత పాకింది. మాదిగ్గూడెం పెద్దమనుషులకు వర్తమానం పంపిన్రు. ఊళ్లె విగ్రహం పెట్టడానికి వీల్లేదు అన్నది దాని మతలబు. ఈ ముచ్చట సోమేషుకు తెలిసి, పదిమందినేసుకొని దొర యింటికే వచ్చి ‘‘విగ్రహం పెట్టుకొనియ్యక పోతే ఊకోం పటేలా’’ అన్నడు.
రామేశ్వర్‌రావుకు ఆ మాట గడ్డపార లెక్క తగిలింది. ‘‘నా కాళ్ల కింద బతికెటోళ్లు నాలుగు అచ్చరం ముక్కలు నేర్వంగనే నాకే వార్నింగులు ఇచ్చేటంత పెద్దోళ్లు అయిన్రా. అయినా పిల్లకాకి వీడు. పెద్ద మొగొడైపోయిండా’’ అని లోలోపలే అనుకున్నడు. బయటికి మాత్రం ‘‘ఇగో సోమేషు నాదేమున్నదిరా. ఊరంత ఎట్లంటే నేను అట్లనే అంట” అన్నాడు. ‘‘నా దగ్గరెందుకుగానీ, ముందు విగ్రహం వద్దన్నోళ్ల దగ్గర తేల్చుకోపోరాదుర’’ అన్నడు. సోమేషుకు విషయం అర్థమైంది. సూదరోళ్లనంతా మా మీదికి రెచ్చగొట్టింది దొరేనని పసిగట్టిండు.
గౌండ్లోళ్లు, గొల్లోల్లు, ముత్రాషోళ్లనంత కలిసి విగ్రహం వద్దొనద్దు ‘మామ, బాబాయి’ అని ఏ వరుసతో అలవాటు ఉంటే ఆ వరుసతోనే చెప్పుకొచ్చిండు సోమేషు. ‘‘వాళ్లు మాకేం ఇబ్బందిరా, కాకుంటే ఆ దొర సంగతి మీకు తెల్వంది ఏమున్నది. తను అనుకున్న పనులన్నీ మా తోటే చేపిస్తడు’’ అని పక్కకు తప్పుకున్నరు. మళ్లీ దొర యింటికి పోయి దొరతో మాటల యుద్దానికి దిగిండు సోమేషు.‘‘రాజ్యాంగం రాసిన జాతి నిర్మాత విగ్రహాన్ని అడ్డుకోవడం మంచిది కాదు దొరా’’ అని హెచ్చరించినంత పని చేసిండు. దొరకు ఈ వార్నింగులు నచ్చలేదు. ఎట్లా పెడుతరో చూస్తానని మరో ఎత్తు ఏసిండు దొర. గ్రామ పంచాయితీ, వార్డు మెంబర్లతో మరో రహస్య మీటింగ్ పెట్టి విగ్రహానికి పర్మిషన్ రాకుండా చేసిండు.
ఇంత జరిగినా మారని దొరకు బుద్ధి చెప్పాల్నెనని ఎస్సీ కాలనీ యూతంతా రంగంలోకి దిగిన్రు.
సరిగ్గా ఇదే టైంల దొర తల్లి సచ్చిపోయింది. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడ్డది. దొర యింట్ల కుక్క సచ్చిపోతే ఊరంత వచ్చి యేడ్చే ఇగురం ఒకనాడు. ఇయాల మాత్రం తల్లి సచ్చిపోతే డప్పులు కొట్టడానికి ఒక్క మనిషి రాలేదు.
రామేశ్వరరావు కోపం కట్టలు తెగుతున్నది. పండ్లు నూరుతున్నడు. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. ముందు తల్లి సావు అయిపోయినంక చూస్తేమాయే అనుకున్నడు. తల్లి సావు డప్పుల సప్పుళ్లు లేకుంట ఎట్లా చేసుడు అనే పరేషాన్‌లో పడ్డడు. దొర తండ్లాట జూసి పక్కూరి సర్పంచ్ మాణిక్యం ‘‘పటేలా నువ్వు బాధపడకు డప్పులు కావాలంటే మా ఊరునుండి తెప్పిస్తా’’ అని సెల్లు తీసి ఫోన్ కొట్టిండు. కానీ, ‘‘ఏ ఊరు మాదిగలకు ఆ ఊరి సావుల మీద హక్కు ఉంటది. అట్లా వారిని కాదని మేము రాలేము సర్పంచ్ సాబ్’’ అని మళ్లోపాలి దొర ఆశలకు గండికొట్టిన్రు. ఏం చెయ్యాలే. ఎట్ల చెయ్యాలే. డప్పు ఎంత? డప్పు విలువెంత అని కోపానికొస్తున్నడు దొర. కానీ, అదే డప్పు ఇప్పుడు తన పరువుకు పందెమై కూసున్నది.
తన తండ్రి కాలంల మాదిగోళ్ల డప్పులు మోగంది కార్యమే లేదు. దొరింట్లనే కాదు ఊళ్లె ఏ చిన్న కార్యమైనా డప్పుల మోతతోనే రక్తికట్టేది. పురుళ్ల దావతు మొదలయ్యే డప్పుతోనే. పదిమంది కూడితే డప్పు, కూరాళ్లు పడితే డప్పు, బోనమెత్తితే డప్పు, పెండ్లికి కంకణాలు కడితే డప్పు, దసరనాడు జమ్మాకుకు పోతే డప్పు, బతుకమ్మలు చెర్లేస్తే డప్పు, ఊళ్లె పీరిమ్మలాడితే డప్పు, ఊరవతల తండాల లంబాడీల ఆటపాటలకు డప్పు, మనిషి సచ్చిపోతే స్మశానం దాకా పుట్టెడు బాధను మరిపించే సప్పుడంతా డప్పే. ఊరందరికీ ఏదన్న ముచ్చట చేరెయ్యాలన్నా, ఓట్లల్ల గెలువాలన్నా, గెలిచినంక జులూస్ తియ్యాలన్నా డప్పే. ఎన్ని తీర్ల దరువులు. జెం జెజ్జెనక నకనక జెం జెం జెజ్జెనక నకనక జెం అనుకుంటు సావుడప్పు మోత, పులి అడుగు దెబ్బ, జాతర జతి, సాటింపు దరువు, దండోర దరువు, లంబాడీ దరువు, దిమ్మీస దరువు, పీరి దరువు, ఎలుగుబంటి దెబ్బ, ఐరేని కుండల దరువు, పెండ్లి దరువు బతుకు ప్రతి సందర్భాన్ని మోగించే డప్పు. ఇన్ని దరువులు మోగే డప్పు ఇవాళ దొర తల్లి సావుకు మాత్రం రానని మొరాయిస్తున్నది.
రామేశ్వరరావుకు ఎటూ పాలుపోతలేదు. ఊళ్లల్ల నుండి రాత్రే వచ్చిన సుట్టాలు అంబటాల్ల అయ్యేసరికి పంచల పొంటి నిలబడి దిగాలు పడుతున్నరు. ‘‘ఏమైంది దొర ఆలస్యమెందుకు?’’ అంటున్నరు. ‘‘లేటయితే పీనిగె వాసన లేస్తది. సావు కానియ్యాలె’’ అన్నరు. ఇంకొందరు మేము దూరం పోవాలె అన్నరు. ఈ మాటల నడుమ రామేశ్వరరావుకు ఊరి మాదిగల ముఖాలు గుర్తుకొస్తున్నయి. వాటి మీద కోపం తన్నుకొస్తున్నది.‘‘నా కాళ్లకింద చెప్పులా పడి ఉండాల్సినోళ్లు ఇవాళ నా తల్లి సచ్చిపోతే రానంటారా?! వాళ్ల సంగతి చెప్పాలే. ఎట్లా వదిలిపెడత వాళ్లను’’ అనుకుంటున్నడు. ఇంతల్నే దొరకు పెద్దయ్య వరసయ్యే గోవర్ధనరావు కల్పించుకొని ఓ ముచ్చట చెవిలేసిండు. మన అక్కెర తీరే దాకా ఓపిక పట్టాలె. ముందుగాల మాదిగిండ్లకు మనిషిని పంపి చూడు. రెండు వెయ్యిలు ఎక్కువిస్తమని చెప్పిండు. దొరకు ఈ సలహా కూడా రుచించలేదు కానీ, తప్పెటట్టు లేదు. పైసల్ పోయినా పర్వాలేదు. పరువు దక్కాలె. తన తల్లి సావు మంచిగ చెయ్యాలె. ఎక్కడ కూడా తక్కువ కావద్దనుకున్నడు. ఒక మనిషిని మాదిగ్గూడానికి పంపించాడు.
అందరు కలిసి ఒక్కతాటి మీద ఉందామనుకున్న మాదిగలు అస్సలు రామని చెప్పిన్రు. ‘‘రెండు వెయ్యిలు కాదు, పదివేలిచ్చినా వచ్చేది లేదు’’ అని తెగేసి చెప్పిన్రు. దొరకు మరోసారి ఆశాభంగం కలిగింది.
చేతులు పిసుక్కున్నడు. కండ్లు ఎర్రగ లేసిండు. ఏదీ దోయక అటూ ఇటూ తిరిగిండు. సుట్టాలు పాడెకడుతున్నరు. పాడె ఎప్పుడైనా డప్పుల సప్పుల్ల నడుమే కట్టాలి. కానీ, డప్పులోల్ల తిరుగుబాటు తెలిసి ఆశ వదులుకొని తలోదిక్కు తలుగబడి పాడె సిద్ధం చేస్తున్నరు. రాత్రి ఇంటి వాకిట్ల కుండ పెట్టి ముట్టిచ్చిన మంట కూడా ఆరిపోయింది. కట్టెలు కాలి బూడిదైనై. అయినా ఇంకా సావు కార్యెం మొదలు కాలేదు.
కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్న దొరకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అసలు నా తల్లి సావుకు డప్పులు ఎందుకు? పెండ్లికి పెట్టినట్టు బ్యాండు పెట్టుకొని తీసుకపోత అనుకున్నడు. ఊళ్లె సాకలి కట్టెయ్యకు ఫోన్ చేసి, బ్యాండోళ్ల నందరిని తీసుకొని రమ్మన్నడు. అక్కడ కూడా దొరకు చుక్కెదురయ్యింది. ‘‘పెండ్లిల్ల సీజనయ్యే సరికి పదూళ్ల అవుతల పెండ్లికి వాయించడానికి వచ్చినం. ఇప్పటికిప్పుడు రాలేం పటేలా? పెండ్లోల్ల కాడ మాట పోతది. ఇప్పుడు ఊరేగింపుల్నే ఉన్నం. మధ్యల వదిలిపెట్టి రాలేం’’ అన్నడు. ఏ ఊరు బ్యాండోళ్లకు ఫోన్ చేసినా అదే సమాధానం. ‘‘ముందే చెప్పొద్దా’’ అని దీర్ఘాలు తీస్తున్నరు. దొర అని మర్యాద ఉన్నది. గానీ, ‘‘సావుకు వాయించాల్నా’’ అనే మొహమాటం కూడా లోపల ఉన్నది.
సుట్టాలకు యాష్టకొస్తున్నది. ముసల్దాని సావు చూసి పోదామని పనులన్ని పక్కన పెట్టి కార్లేసుకొని వచ్చిన్రు. సావు ఆలస్యమయ్యే సరికి తాళ్లల్లకు పోయి కల్లు తాగి వచ్చిన్రు. అయినా ఇంకా పీనిగెను లేపలేదు. తాగినమైకంల దొరను మాటలు అంటున్నరు. ఇదేం సావంటున్నరు.
ఇగ తప్పెటట్టు లేదని దొర ‘‘సప్పుల్లు లేకుంటమాయే సావు చేద్దాం ఏమైతది’’ అన్నడు. సుట్టాలంతా ముక్కున వేలేసుకున్నరు. రామేశ్వరరావు దొరకు ‘‘అసలు డప్పుల పద్ధతి ఎవడు పెట్టిండు’’ అని కోపం వస్తున్నది. మరో దిక్కు ఎటు దోయకుండా మైకుల ఘంటసాల భగవద్గీత మోగుతున్నది. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టిన వాడు పుట్టక మానడు అని రాగం తీగసాగినట్టు సాగుతున్నది. దొరకు మాత్రం ఊరి మాదిగోళ్ల మీద కోపం రగిలిపోతున్నది. అసలు ఇక లాభం లేదని చివరిసారి మాదిగిండ్లల్లకు మనిషిని పంపి, అంబేద్కర్ విగ్రహానికి పైసలు నేనే పెట్టుకుంటా డప్పులోల్లను రమ్మనమని చెప్పి పంపిండు.అయినా సరే మాదిగలు మాత్రం ‘‘ఆయిన ఏందట విగ్రహం కొనిచ్చేది. ఆల్రెడీ ఇంటికింత చందాలేసుకున్నం’’ అని రిటర్న్ పంపిన్రు. ఇక చుట్టాలు లొల్లి పెట్టక ముందే రామేశ్వరరావు దొర తల్లి సావు చేసుడు మేలనుకున్నడు. ఊళ్లె జనం కూడా అదే మంచిదన్నరు.
సప్పుళ్లు లేకుండా తొలిసారి ఆ ఊళ్లె సావు జరుగుతున్నది. దొర కుండ పట్టుకొని ముందు నడుస్తున్నడు. పాడెత్తుకున్నోళ్లు అడుగుల అడుగేస్తున్నరు. పేలాలు రూపాయి బిల్లలు దారిపొడుగునా సల్లుతున్నరు. కుంకుమతో బొట్లు పెట్టుకున్నరు. నిన్నటి నుండి ఏడ్చిన దొరింటి ఆడోళ్లు, ఇంకా ఏమేడుస్తం అన్నట్టు నిశ్శబ్దంగా నడుస్తున్నరు. ఊరు మీద వాడలల్ల జనానికి ఈ సావు చిత్రమనిపిస్తున్నది. సప్పుడు లేదు, సరిలేదు. మధ్య మధ్యల ఆపి ఎగిరి దునికే లొల్లి లేదు. ‘అసలు సావు ఎక్కడైనా గిట్ల ఉంటదా?’ అని కొంగులు నోటికి అడ్డం పెట్టుకొని నవ్వుతున్నరు.
దొర మాత్రం తలకాయ కిందేసుకొని యుద్ధంలో ఓడిపోయినోడిలా నడుస్తున్నడు. తాను స్మశానం దగ్గరికిపోయిండో, స్మశానమే తన దగ్గరికి నడిసొచ్చిందో అర్థం కాలేదు. తల్లి సావు అడివిల బతికినట్టు ఏ సందడి లేకుండా సప్పగా స్మశానం చేరిపోయింది. సుట్టాలే తల ఒక చెయ్యేసి పేర్చిన కాష్టం మీద దొర తల్లి శవాన్ని పడుకోబెట్టిన్రు. దొర ఎక్కడ్నో ఆలోచిస్తూ చితికి నిప్పు పెట్టిండు. దొర కోపమోలే మండుతున్నది కాష్టం. దొర ఆ మంటలోకి దీర్ఘంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
తెల్లారి మాత్రం పేపర్ల ఒక వార్త గుప్పుమన్నది. సావులకు డప్పులు కొట్టమన్న దళితులు, డప్పులు లేకుండానే చావు జరిపించుకున్న ఊరి భూస్వామి.
డప్పు విలువేందో దొరకు, ఆ ఊరికి కొత్తగా తెలిసొచ్చింది. డప్పులోల్లు తిరగబడితే ఎవ్వరి బతుకులైనా ఎట్లా కిందమీదైతో ఎర్కయ్యింది. దొర చేయబోయే దాడుల పథక రచనను కూడా గ్రహించిన ఎస్సీ కాలనీ కూడా అంతే పకడ్బందీగా గుతుపలతో సిద్ధంగా ఉంది. ఆ రాత్రి ఎస్సీ కాలనీ చింత కింద డప్పులు మోగుతున్నయి. డాన్సులు హోరెత్తుతున్నాయి. పాటలు మత్తడి దుంకుతున్నాయి. తరాలుగా ఓడిపోయినవాళ్లు, ఇవాళ గెలిచినట్టు దావత్ చేసుకుంటున్నరు. జెంజెజ్జెన జెజ్జెనక జెం....జెం జెజ్జెనక జెం......
-పసునూరి రవీందర్, ఫోన్ :7702648825
