
కొన్ని విషయాలు వినడానికి బాగుంటాయి. మరికొన్ని చూడడానికి బాగుంటాయి. ఒకోసారి విన్నవో లేక చూసినవో ఇబ్బందికి గురిచేస్తుంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఈశ్వరయ్య విషయంలో అచ్చంగా అదే జరిగింది! జీవితం సాఫీగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో ఒక సమస్య ఎదురైంది. ఏం చేయాలో తోచక ఈశ్వరయ్య తలపట్టుకున్నాడు.
* * *
ఆదివారం కావడంతో ఆ రోజు కాస్త ఆలస్యంగా నిద్రలేచాడు ఈశ్వరయ్య. కాసిని వేడి వేడి కాఫీ నీళ్ళు గొంతులో పడ్డాక, భార్య సరోజకు చెప్పి, వాయిదాల మీద వాయిదాలు పడుతున్న హెయిర్ కటింగ్ కోసం సెలూన్‌కి బయల్దేరాడు బైక్ మీద. మధ్యలో ఇస్త్రీ షాపు దగ్గర ఆగాడు. వారం అవుతోంది. ఇస్త్రీ బట్టలు అప్పజెప్పక. ఈశ్వరయ్య తన బైక్‌ని షాపు ముందు ఆపగానే బయటకు పరిగెత్తుకు వచ్చిన ఇస్త్రీ అబ్బాయి శేఖర్ ‘‘ బట్టలు ఈరోజు సాయంత్రం ఇస్త సారూ!” అన్నాడు. ఎప్పుడూ పాడే పాటే అయినా ఈసారి మరింత నమ్మకంగా, కాసింత వినయాన్ని కలగలిపి చెప్పాడు.
‘‘చేసే పని బాగానే ఉంటుంది. కానీ రేపు మాపు అంటూ తిప్పుతావు. ఇదేం మాయరోగం? రేపు ఆఫీస్‌కి వేసుకోవడానికి బట్టలు లేవయ్యా బాబూ!’’
‘‘మీరేం కంగారు పడకుండ్రి సారూ! తప్పకుండా ఈరోజు పని పూర్తి చేస్తలే’’
‘‘ఇది ఎప్పుడూ ఉండేదేగా!’’ కాస్త విసుగు ధ్వనించేలా అన్నాడు.
‘‘అయ్యో సారూ! అట్ల అంటరేంది? గిరాకీ అట్ల ఉంటుంది’’
‘‘కొత్తగా వచ్చిన వాళ్లను, రెగ్యులర్‌గా వచ్చేవాళ్లను ఒకే గాడిన కడితే ఎలాగయ్యా? ఈ రోజు పూర్తి కానివ్వు” అంటూ బయల్దేరబోయాడు.
బైక్ సెల్ఫ్ స్టార్ట్ చేయబోతున్న ఈశ్వరయ్యను ఆగమంటూ చేత్తో సైగ చేస్తూ దగ్గరగా వెళ్లి ‘‘మీరేమీ అనుకోనంటే ఒక్కమాట సారూ..!’’ అన్నాడు శేఖర్.
‘‘ఇందులో అనుకోవడానికి ఏముంది? నీ గురించి నాకు తెలియనిది ఏముంది? ఏమైనా డబ్బులు కావాలా?” అన్నాడు ఈశ్వరయ్య.
అడగ్గానే ఇలాంటి వాళ్లకు డబ్బులివ్వడమే కాకుండా... తెలిసినవాళ్ళకు ఎవరికైనా సరే చిన్నా చితకా పనులకు సాయం కూడా చేస్తుంటాడు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం. అందరి నోళ్లలో మంచివాడుగా నానుతుంటాడు.
‘‘నెల కింద బాగా అవుసురం ఉండి అయిదువేలు తీసుకొని, మల్ల ఇచ్చిన కద సారూ! అవుసురం ఉంటే మల్ల అడగనా సారూ! అది కాదు...” అని నసుగుతూ.. ‘‘నిన్న సాయంత్రం మా గుడిసెల అవతల ఉన్న తాటిచెట్ల కాడికి మీ అబ్బాయి వచ్చిండు సారూ! ఈ వయసులోనే తాగుడు షురువైతే ఎట్ల సారూ! ఇగ మీ చేతికి దొరుకుతడా?’’ అంటూ ఒక మాట విసిరాడు శేఖర్.
అది విని బిగుసుకుపోయాడు ఈశ్వరయ్య.
‘సందీప్ తాగుతున్నాడా?’
ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది.
శేఖర్ తనని పట్టుకుని నిలదీస్తున్నట్టుగా అనిపించి తలకొట్టేసినట్టయ్యింది ఈశ్వరయ్యకు. ఒకరితో చెప్పించుకునే పరిస్థితి ఎదురైనందుకు.. అదీ వయసులో బాగా చిన్నవాడైన శేఖర్‌తో... కాస్త అసహనానికి గురయ్యాడు.
ఇందుకు కారకుడైన కొడుకు మీద విపరీతంగా కోపం వచ్చింది. మరో మాటకు తావు ఇవ్వకుండా జేవురించిన మొహంతో వెంటనే అక్కడి నుంచి బైక్ కదిలించాడు.
బార్బర్ షాప్‌కు వెళ్ళి, షాప్ ముందర గద్దెపై కుర్చీలో కూర్చున్నాడు. మనసు మళ్ళడానికి పేపర్ ముందేసుకున్నాడు... ఓ పక్కన లోలోపల మదనపడుతూనే.
లోపల ఎవరికో షేవింగ్ చేసే పనిలో ఉన్న ప్రవీణ్.. ఈశ్వరయ్య కనబడగానే పనాపి పరుగు పరుగున బయటకు వచ్చాడు. ‘‘ఈ షేవింగ్ కాక ఇంకా వరసలో కటింగ్‌కి ముగ్గురున్నారు సార్! ఆగుతారా? మరొక గంటాగి మళ్ళీ వస్తారా?” అని అడిగాడు.
‘‘అవునా! పర్లేదు. నాక్కూడా ఒకట్రెండు పనులున్నాయి. చేసుకుని వస్తాను. ముందు కిరాణా కొట్టుకు వెళ్లి ఇంట్లో ఒకట్రెండు సామాన్లిచ్చి రావాలి’’ అంటూ లేచాడు.
లోపలకు వెళ్లబోయినవాడల్లా ఎందుకో వెనక్కు తిరిగాడు ప్రవీణ్. ‘‘సార్! ఒక్కమాట..." అన్నాడు. అక్కడి నుండి కదలబోతున్న ఈశ్వరయ్యకు మరింత దగ్గరగా వచ్చి ‘‘... ఇలా అంటున్నానని ఏమీ అనుకోరు కదా!” అన్నాడు.
ప్రవీణ్ లోగొంతుతో చెబుతుంటే అదేదో ఎవరికీ తెలియకూడని సీక్రెట్ కావచ్చనుకున్నాడు ఈశ్వరయ్య.
అతనితో పని పడినప్పుడు ఇలాగే చేస్తుంటాడు ప్రవీణ్.
‘‘మన మధ్యలో అనుకోవడానికి ఏముందయ్యా! ఇద్దరం బాగా తెలిసిన వాళ్ళం, పాతవాళ్ళమే కదా! పర్వాలేదు. విషయమేంటో చెప్పు. మళ్లీ ఏదైనా లోన్ తీసుకుంటున్నావా? ష్యూరిటీ ఇవ్వాలా?” అన్నాడు ఈశ్వరయ్య.
“మొన్న మా దోస్తులంతా కలిసి పార్టీ చేసుకుందామని బార్కి వెళ్ళాం సార్! అక్కడ మీ అబ్బాయి తాగుతూ కనిపించాడు. సార్!” మూడో చెవికి వినపడనంత మెల్లగా గొణిగాడు ప్రవీణ్.
ఆ మాట చెవిన పడగానే ఎవరో విసురుగా తనని కిందికి పడదోసినట్టు అనిపించింది ఈశ్వరయ్యకు.
‘ఇంటర్మీడియట్ సెకండియర్ లోనే వీడికీ తాగుడు అలవాటేంటి?’
ఈశ్వరయ్య పరిస్థితి చూడాలి.. ఒళ్లంతా భారంగా అయిపోయింది. మెదడు మొద్దుబారి పోయింది.
ఏం చెప్పాలో తోచక బైక్ దగ్గరికి నడుస్తుంటే, తిరిగి గుసగుసగా ‘‘మీవాడితోని జర జాగ్రత్త సార్! ఇంత చిన్నపిల్లగానికి తాగుడు అవసరమా సార్! అబ్బాయిని కాస్త కంట్రోల్లో పెట్టుకోండి’’ అంటూ లోపలికి వెళ్లి తన పనిలోకి దిగాడు ప్రవీణ్.
‘వీడివల్ల తల ఎత్తుకో లేని పరిస్థితి ఏర్పడుతోంది. అడ్డమైన వాళ్లతో చెప్పించుకోవాల్సి వస్తోంది’ చికాకు పడ్డాడు ఈశ్వరయ్య.
అనడానికి ఏమీ లేక తలవంచుకుని బైక్ స్టార్ట్ చేసి బయల్దేరాడు. కిరాణా షాప్ దగ్గర ఆగాడు. తనకు కావాల్సిన ఒకట్రెండు సామాన్లు చెప్పాడు.
‘‘బాగున్నారా సార్?’’ కుశలప్రశ్నలు వేశాడు షాప్‌లోని షావుకారు కిరణ్.
బదులుగా తలూపాడు ఈశ్వరయ్య.
‘‘ఎప్పుడూ మీ అబ్బాయిని షాప్‌కు పంపేవాళ్ళు. చాలా రోజుల తర్వాత మీరు వచ్చారేంటి?”
‘‘కటింగ్ షాపు వైపు వచ్చాను. అక్కడ ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకని మధ్యలో ఈ పని చేసుకుందామని వచ్చాను” అన్నాడు ఈశ్వరయ్య.
ఆయన చెప్పిన ఐటమ్స్ అన్నీ కుదురుగా ప్యాక్ చేశాడు కిరణ్. వాటికి డబ్బు ఇచ్చేసి ఆ కవర్ని బైక్‌కు తగిలించబోయాడు ఈశ్వరయ్య.
‘‘సారూ! మీరు నా షాప్ కు వచ్చే రెగ్యులర్ కస్టమర్. అదీకాక మీ ఆఫీసులో పని పడితే పైసా ఖర్చు లేకుండా నాకు పని చేయించి పెట్టారు. మీ దగ్గర ఒక విషయం దాచడం నాకు నచ్చడం లేదు” మెల్లగా అన్నాడు కిరణ్.
‘‘దాచడం ఎందుకు? చెప్పు. ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా? అక్కడ కూడా నా సేవలు అవసరమా?’’ అన్నాడు.
‘‘ఈ ఒక్క కిరాణంతోనే చచ్చిపోతున్నం. ఇంక మరొక బిజినెస్సా? టైం ఎక్కడ ఉంటది సార్!’’
“నువ్వు తలచుకుంటే ఎంతసేపు గాని. అది ఏంటో చెప్పు’’
‘‘ఈ జమానా అంతా దోస్తుల బట్టి ఉంటుంది సార్! పిలగాండ్లు చెడిపోవుడైనా, మంచిగా ఉండుడైనా! మీ అబ్బాయికి ఫ్రెండ్స్ మంచిగా లేనట్టున్నరు. రోజూ తాగుతడట కదా సార్.. సందీప్!’’
గతుక్కుమన్నాడు ఈశ్వరయ్య.
వాడు తాగడం... అది పదిమందికి తెలియడం.. తెలిసిన వాళ్లు తనని అడగడం ... మెంటల్ ఎక్కుతోంది. కానీ, వాళ్ల ముందు కొడుకు గురించి చెడుగా ఏవీ మాట్లాడలేక పోతున్నాడు. ఎలాంటి మాట జారినా పోయేది తన పరువే కదా! అందుకని మిన్నకుంటున్నాడు.
“చాలా ఏండ్ల నుంచి మీ నాన్నను, మిమ్మల్ని చూస్తున్నాను సార్. మీకు లేని అలవాటు మీ అబ్బాయికి ఎలా వచ్చింది సార్?’’
అతడిచ్చిన పొగడ్తకు ఈశ్వరయ్యకు అదోలా అనిపించింది.
‘‘ఏమో కిరణ్? ఇంటికి వెళ్ళాక విషయమేంటో ఆరా తీయాలి మరి”
‘‘అయ్యో జాగ్రత్త సార్! ఈ కాలం పిల్లలు దేన్నీ తట్టుకుంట లేరు. మర్లపడడం లేదా అఘాయిత్యం చేసుకోవడం తప్ప మంచి-, చెడు ఆలోచించడం లేదు. పెద్దవాళ్లు మన బాగు కోరే చెబుతున్నారు కదా అనే ఇంగితం కూడా ఉండడం లేదు. చెప్పింది చెవిన వేసుకోవడం లేదు’’ ఎందుకైనా మంచిదని జాగ్రత్తలు కూడా చెప్పాడు కిరణ్.
‘‘నువ్వంటున్నది నిజమే! కానీ, చూస్తూ చూస్తూ పిల్లలు చెడు వ్యసనాల బారిన పడితే ఊరుకోలేం కదా!’’ అన్నాడు ఈశ్వరయ్య.
ఇతరులతో కుటుంబ విషయాలు చర్చించడమే ఇష్టం ఉండదు. అలాంటిది ఏకంగా తన కొడుకు తాగుతున్నాడని ప్రచారం కావడం మనసున పట్టడంలేదు. పైగా, ఒకరికి చెప్పాల్సిన స్థితిలో ఉన్న తాను ఇతరుల చేత చెప్పించుకోవడం కాస్త నామోషీగా ఫీల్ అవుతున్నాడు.
‘‘మీకు ఉన్నది ఒక్కడే కొడుకు. మీకు తెలియదా ఎలా మందలించాలో? నేను చెప్పడం దేనికి? కానీ, నా ద్వారా ఈ విషయం తెలిసినట్టు మీ ఇంట్లో వాళ్ళెవరితోనూ అనకండి సార్! రేప్పొద్దున జరగరానిది ఏదైనా జరిగితే అనవసరంగా నేను ఇరుకున పడాల్సి వస్తుంది. ఉత్తపుణ్యానికి ఇరుక్కోవాల్సి వస్తుంది” చాలా తెలివిగా విషయం చేరవేశాడు కిరణ్.
‘ఇతరుల గురించి ఏ చిన్న విషయమైనా వీళ్ళకే కావాలి. ఏంటో జనం మనస్తత్వం’ అని మనసులో అనుకుంటూ నిట్టూర్చాడు ఈశ్వరయ్య.
మరి అతడు అడిగినదానికి మాట ఇవ్వాలి కదా ‘‘నా కొడుకు తాగుతున్నాడనే విషయం నీ ద్వారా తెలిసిందని నేనెందుకు చెబుతానయ్యా! అలాంటి అనుమానాలేం పెట్టుకోకు. సరే వస్తా!” అంటూ అక్కడి నుండి బయల్దేరాడు.
* * *
“ఈ విషయం తెలుసా?’’ ఇంటికి రాగానే భార్య సరోజ మీద అంతెత్తున ఎగిరాడు ఈశ్వరయ్య.
“ ఏంటో చెప్తే కదా తెలిసేది?’’ బదులిచ్చింది సరోజ.
‘‘నీ సుపుత్రుడు ఉన్నాడా ఇంట్లో...’’ కాస్త గొంతు తగ్గించి అడిగాడు.
“లేడు’’ పొడిగా జవాబిచ్చింది.
‘‘వాడి గురించి కొత్తగా ఏదో వినిపిస్తోంది’’
‘‘ఏంటండీ!’’ కాస్త ఆదుర్దాగా అడిగింది.
‘‘వాడేం చేస్తున్నాడో... ఎటు పోతున్నాడో... అసలు తల్లిగా నీవేమైనా పట్టించుకుంటున్నావా?’’
‘‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” బదులిచ్చింది.
‘‘నేనేం మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు. పొంతన ఏమైనా ఉందా?’’ గొంతు పెంచాడు ఈశ్వరయ్య.
‘‘ఇన్నేళ్ల కాపురంలో మీరెప్పుడైనా నాకేమైనా చెప్పి చేశారా? కనీసం ఆఫీసు నుంచి ఎందుకు లేటుగా వస్తున్నారో కూడా నాకు తెలియదు. అలాంటిది మనబ్బాయి నుండి కూడా ఆశించడం అత్యాశ అవుతుందేమో?’’ నిరాసక్తిగా అంది.
“మీ అబ్బాయి తాగుతున్నాడు సార్! అని బయట జనం కోడై కూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది తెలుసా?” అసలు విషయం చెప్పాడు.
‘‘ఇందులో విడ్డూరం ఏముందీ? మీరు చేసే పనేగా వాడూ చేస్తోంది. వారసత్వం మరి. బయటవాళ్లకు తెలిసేలా మీరు తాగుతున్నారు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా వీడు తాగుతున్నాడు. తేడా అంతేగా!’’
భార్య మాటల్లోని వెటకారానికి గతుక్కుమన్నాడు ఈశ్వరయ్య. ఏమీ మాట్లాడలేక మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.
* * *
పెను తుపానులా చుట్టుముట్టిన ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో తెలియక... కొడుకు చేత తాగుడెలా మాన్పించాలో అర్థం కాక... చాలా రోజులు మదనపడ్డాడు.
ఈ గండం గట్టెక్కాలంటే ముందు తాను చేయవలసిందేమిటో నెమ్మదిగా అర్థమైంది.
జీవితంలో తొలిసారి తనలోకి తాను వెళ్లిపోయి... తనలోంచి తాను సరికొత్త ఆలోచనలతో బయటకు వచ్చాడు.
దృఢ నిశ్చయానికి వచ్చిన ఈశ్వరయ్య , ఒక స్థిర నిర్ణయం తీసుకున్నాడు.
* * *
‘‘ నేను తాగుడికి బానిసనయ్యానని మీ దృష్టికి తెచ్చినవాళ్లంతా... మీ మీద ఉన్న గౌరవంతో నేరుగా మీతో ఏమీ అనలేక... మీ వ్యసనం గురించి నాతో చెప్పినవాళ్లే నాన్నా! ఒక కొడుకుగా మీచేత దాన్నెలా మాన్పించాలో తెలియక... ఈ వ్యూహాన్ని అనుసరించాల్సి వచ్చింది. మీరు మారారు. అమ్మ కూడా హ్యాపీ. అది చాలు.
మీ ఇద్దరికీ తెలియకుండా ఇలా చేయాల్సి వచ్చినందుకు... నాన్నా...నన్ను క్షమించు’’
-అక్షత్ వేద ఎనుగంటి, ఫోన్ నెం: 9440236055