సాయంత్రం అయిందంటే చాలు ఏదో ఒక శ్నాక్ తినాలనిపిస్తుంది. వాటిలో కొందరు కరకరలాడేవి కోరుకుంటే మరికొందరు స్పైసీగా ఉండేవి కావాలంటారు. ఇంకొందరేమో వేడి వేడిగా పొగలు కక్కే శ్నాక్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అంటారు. ఇలా రకరకాల రుచుల శ్నాక్స్ కోరుకునేవాళ్ల కోసం వాటి రుచిని ఎంజాయ్ చేస్తూనే, అన్ని న్యూట్రియెంట్స్ అందేలా చేస్తే బాగుంటుంది కదా! అందుకే రకరకాల వెజిటబుల్స్ శ్నాక్స్ ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
వెజ్ చిల్లీ పనీర్ తయారీకి కావాల్సినవి
- పనీర్ ముక్కలు - ఒకటిన్నర కప్పు
- కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - పావు కప్పు
- నూనె - సరిపడా
- సోయా సాస్, కారం, రెడ్ చిల్లీ సాస్, అల్లం తురుము - ఒక్కో టీస్పూన్ చొప్పున
- మిరియాల పొడి, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, ఉల్లికాడల తరుగు - పావు టీస్పూన్ చొప్పున
- రెడ్ చిల్లీ పేస్ట్ - రెండు టీస్పూన్లు
- ఉప్పు - సరిపడా
- నీళ్లు - పావు కప్పు
- మైదా - అర కప్పు
వెజ్ చిల్లీ పనీర్ తయారీ విధానం
ఒక గిన్నెలో పనీర్ ముక్కలు, అందులో కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. ఒక గిన్నెలో మైదా వేసి, సోయా సాస్, కారం, రెడ్ చిల్లీ సాస్, అల్లం తురుము, మిరియాల పొడి వేసి, నీళ్లు పోసి కలపాలి. అందులో పనీర్ ముక్కలు ముంచి, తీసి నూనెలో వేగించాలి. ఒక పాన్లో ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, ఉల్లికాడల తరుగు వేసి వేగించాలి. వేగించిన పనీర్ ముక్కలు కూడా వేసి కలపాలి. కార్న్ ఫ్లోర్లో నీళ్లు పోసి కలిపి, ఆ నీళ్లను ఇందులో చల్లాలి. కాసేపు వేగిస్తే యమ్మీగా ఉండే వెజ్ చిల్లీ పనీర్ రెడీ.
వెజిటబుల్ పొంగనాలు తయారీకి కావాల్సినవి
- ఇడ్లీ పిండి - ఒక కప్పు
- క్యారెట్, పాలకూర, క్యాబేజీ తరుగు -ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి పేస్ట్ - అర టీస్పూన్
- ఉప్పు - సరిపడా
వెజిటబుల్ పొంగనాలు తయారీ విధానం
ఒక గిన్నెలో ఇడ్లీ పిండి వేసి, అందులో క్యారెట్, పాలకూర, క్యాబేజీ తరుగు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. స్టౌ మీద పొంగనాల పెనం పెట్టి, నూనె పూయాలి. తర్వాత అందులో ఇడ్లీ పిండి మిశ్రమం వేసి ఉడికించాలి. తర్వాత రెండో వైపు తిప్పి మరోసారి కాల్చాలి. వీటిని టొమాటో కెచప్ తింటే చాలా బాగుంటుంది.
మూంగ్ దాల్ క్రిస్పీస్ తయారీకి కావాల్సినవి
- పెసరపప్పు (నానబెట్టిన) - అర కప్పు
- మైదా - ఒకటింపావు కప్పు
- నూనె - రెండు టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర తరుగు - పావు కప్పు
- అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ - రెండు టీస్పూన్లు
- నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
- చక్కెర - మూడు టేబుల్ స్పూన్లు
- పసుపు - అర టీస్పూన్
- ఉప్పు, నూనె - సరిపడా
- నువ్వులు - ఒక టేబుల్ స్పూన్
మూంగ్ దాల్ క్రిస్పీస్ తయారీ విధానం
నానబెట్టిన పెసరపప్పును మిక్సీజార్ లో వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో మైదా, నూనె, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, చక్కెర, పసుపు, ఉప్పు వేసి ముద్దగా కలపాలి. దానిపై తడిబట్ట కప్పి కాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని చపాతీలా ఒత్తాలి. దాన్ని చాకుతో నచ్చిన ఆకారంలో ముక్కలుగా కత్తిరించుకోవాలి. వాటిని నూనెలో వేసి వేగించాలి. అంతే, కరకరలాడే శ్నాక్స్ రెడీ.
