Suniel Narang: నిర్మాత సునీల్ నారంగ్‌ సంచలన నిర్ణయం.. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి రాజీనామా

Suniel Narang: నిర్మాత సునీల్ నారంగ్‌ సంచలన నిర్ణయం.. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి రాజీనామా

టాలీవుడ్ సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నిర్మాత, బిజినెస్ మెన్ సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) పరిశీలించి అధికారికంగా ఆమోదించింది. సునీల్ నారంగ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, తక్షణమే ఆయనను బాధ్యతల నుంచి తప్పించినట్లు ఛాంబర్ వెల్లడించింది.

ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వివరాలు వెల్లడించింది. మే 19, 2026న సునీల్ నారంగ్ పంపిన రాజీనామా లేఖను పరిశీలించిన కార్యవర్గ సభ్యులు, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆమోదించినట్లు తెలిపారు.

చాంబర్ తరఫున విడుదల చేసిన లేఖలో, “మీ రాజీనామాను ఆమోదించడం కార్యవర్గ సభ్యులకు బాధాకరమైన విషయం అయినప్పటికీ, మీ నిర్ణయాన్ని గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాం” అని పేర్కొన్నారు. అలాగే, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు పూర్తి మద్దతు తెలిపినట్లు స్పష్టం చేశారు. అలాగే ఆయన పదవీకాలంలో చాంబర్ అభివృద్ధికి అందించిన విలువైన సేవలు, సహకారానికి కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిగా, అలాగే నిర్మాతగా.. సునీల్ నారంగ్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆయన రాజీనామా తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది..?

ఛాంబర్ ప్రతినిధులకు పంపిన తన రాజీనామా లేఖలో సునీల్ నారంగ్ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. కొంతమంది సినీ పెద్దలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో కొనసాగడం తనకు సాధ్యం కాదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలంగా లేదని ఆయన తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా ఛాంబర్ వ్యవహార శైలిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, తన తర్వాత వెంటనే బాధ్యతలు చేపట్టేందుకు శేఖర్, విజయేందర్ పేర్లను కూడా సునీల్ నారంగ్ సూచించినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా, ఇప్పటికే ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పలు అంశాలపై భేదాభిప్రాయాలు ఉన్న సమయంలో, సునీల్ నారంగ్ రాజీనామా పరిశ్రమలో మరింత ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇటీవల నిర్మాత నాగ వంశీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం కూడా సునీల్ నారంగ్‌ను అనవసర వివాదంలోకి నెట్టిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ ఘటనతో అసలు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అంశం పక్కకు వెళ్లి, వ్యక్తిగత వ్యాఖ్యలపై చర్చ ఎక్కువైంది. ఇక టాలీవుడ్ లో తదుపరి మార్పు ఎలా ఉండనుందో తెలియాల్సి ఉంది.