సెప్టెంబర్ 17 వేడుకలను ఘనంగా చేద్దాం

సెప్టెంబర్ 17 వేడుకలను ఘనంగా చేద్దాం
  • కొత్త నిజాం కేసీఆర్​ను తరిమేద్దాం
  • సెప్టెంబర్ 17 వేడుకలను ఘనంగా చేద్దాం
  • బీజేపీ నేతలకు సునీల్ బన్సల్ పిలుపు 
  • 74 ఏండ్ల తర్వాత అధికారికంగా జాతీయ జెండాను ఎగరేస్తున్నాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • సెప్టెంబర్17 ప్రిపరేటరీ కమిటీతో భేటీ

హైదరాబాద్, వెలుగు: నిజాం నుంచి 1947లో హైదరాబాద్ కు విముక్తి కలిగిందని, ఇప్పుడు కొత్త నిజాం కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని బీజేపీ క్యాడర్ కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్​చార్జ్ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్థాగత బాధ్యతలను పార్టీ తనకు అప్పగించిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శక్తి వంచన లేకుండా కొట్లాడుదామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవాలకు ఏర్పాట్లపై శనివారం సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ‘‘హైదరాబాద్ విమోచన అమృతోత్సవాల ప్రిపరేటరీ మీటింగ్’’ పేరుతో జరిగిన ఈ సమావేశంలో సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు మురళీధర్ రావు, ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ రావు, బంగారు శృతి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. తెలంగాణ విముక్తి దినోత్సవం గురించి ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలన్నారు. సెప్టెంబర్ 17 ను ఆజాదీ కా అమృత్ మహోత్సవం తరహాలో ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి కార్యకర్త వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజు నుంచి అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాలు  చేపడుతున్నామని, వీటిని విజయవంతం చేయాలని కోరారు.   

అప్పుడు పటేల్.. ఇప్పుడు అమిత్ షా.. 

సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేతలు ఎన్నో పోరాటాలు చేశారని, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు మాత్రం సెప్టెంబర్ 17 ఉత్సవాలకు నో చెప్పాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారికంగా ఉత్సవాలు జరపాలన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వెన్నుచూపిందన్నారు. 74 ఏళ్ళుగా  కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరవేయలేదన్నారు. అప్పుడు సర్దార్ పటేల్ జాతీయ జెండా ఎగురవేస్తే.. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి హోదాలో అమిత్ షా జాతీయ జెండా ఎగురవేయబోతున్నారని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా షోయబుల్లా ఖాన్ తో సహా ఎంతో మంది పోరాడారని, ఇది హిందూ, ముస్లిం సమస్య కాదన్నారు. ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్ ఒవైసీ కాశీం రజ్వీ వారసుడు అని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందన్నారు.  

విస్తృతంగా ఏర్పాట్లు 

సెప్టెంబర్ 17 న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న విమోచన దినోత్సవ సభకు 8 వేల మంది విద్యార్థులను, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను తరలించే ఏర్పాట్లలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. 8వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దినోత్సవ కార్యక్రమాల కోసం పార్టీ19 కమిటీలను నియమించింది. మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన నాలుగు పోలీసు బలగాలతో పాటు రాష్ట్రానికి చెందిన బలగాలు కూడా పరేడ్ లో పాల్గొననున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కనీసం 30 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 3 స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలకు సంబంధించిన మొత్తం ఖర్చును పూర్తి గా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.

ఇయ్యాల మునుగోడుకు సునీల్​ బన్సల్

నల్గొండ, వెలుగు: మునుగోడు బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య​అతిథిగా పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్​చార్జ్​ సునీల్​ బన్సల్​ హాజరు కానున్నారు. బూత్​కు ఐదుగురు చొప్పున మొత్తం 300 బూత్​లకు 1,500 మందితో సమావేశం నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలో బూత్​ ఇన్​చార్జులు, పార్టీ నాయకులు వ్యవహరించాల్సిన తీరు గురించి ఆయన దిశానిర్దేశం చేస్తారు. బన్సల్​ రాక సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ మునుగోడులో శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆదివారం జరిగే మీటింగ్​కు పార్టీ సీనియర్​ నేతలు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి , గంగిడి మనోహర్ రెడ్డి  తదితరులు హాజరుకానున్నారు.