IND vs SA: కవర్స్ కొనడానికి డబ్బు లేదా..? దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై గవాస్కర్ ఫైర్

IND vs SA: కవర్స్ కొనడానికి డబ్బు లేదా..? దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై గవాస్కర్ ఫైర్

సౌతాఫ్రికా-భారత్ మధ్య జరగాల్సిన మొదటి టీ20 నిన్న(డిసెంబర్ 10) వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. డర్బన్ లోని కింగ్స్ మీద వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ లో ఒక్క బాల్ కూడా పడకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై  మండిపడ్డాడు. గ్రౌండ్ ను పిచ్ వరకే కప్పారని.. ఇండియా దగ్గర ఉన్నంత డబ్బులు ఎవరి వద్దా ఉండకపోవచ్చు..కానీ కనీసం గ్రౌండ్ మొత్తం కప్పడానికి ఆ దేశ బోర్డు దగ్గర డబ్బు లేదా అని సూటిగా ప్రశ్నించాడు. 
      
వర్షం పడుతున్నప్పుడు గ్రౌండ్ మొత్తం కవర్ చేయాలనీ.. కానీ వారు మాత్రం కేవలం పిచ్ వరకే కవర్లు కప్పారని.. ఆ మాత్రం దానికి అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించడం ఎందుకు? అని తీవ్ర విమర్శలు గుప్పించారు. "వర్షం తగ్గితే, ఒక గంట తర్వాత మ్యాచ్ ప్రారంభించే అవకాశం ఉంది. గ్రౌండ్ పై కప్పిన కవర్ అంతా తీసి, మళ్లీ సెట్ చేయడానికి సమయం పడుతుంది. లేదంటే మరో గంట ఎక్కువ సమయం పడుతుంది. ఆ ఒక్క కవర్ లేకపోవడం వల్ల మ్యాచ్ మొత్తం రద్దయిపోయంది" కదా…అని అసహనం వ్యక్తం చేశారు. 

అంతర్జాతీయ మ్యాచ్ పై కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టేటప్పుడూ.. ఒకవేళ మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోతే అందరికీ నష్టమేనని.. ఈ విషయాలన్నీ క్రికెట్ సౌతాఫ్రికా నేర్చుకోవాలని అన్నాడు. ఇక నిన్న కింగ్స్‌మీడ్‌లో ఓ మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. ఒకవేళ వర్షం తగ్గు ముఖం పట్టినా ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో ఆట కొనసాగించడం సాధ్యపడదని అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.