
మీకు రామాయణ్(Ramayan) సీరియల్ గుర్తుందా. ఒకప్పుడు యావత్ భారతదేశాన్ని మొత్తం భక్తి పారవశ్యంలో ముంచెసింది ఈ సీరియల్. రామాయణ గొప్పతనాన్ని, అందులోని సారాంశాన్ని కళ్లకుకట్టినట్టుగా చూపించారు. రామానంద్ సాగర్(Ramanand sagar) దర్శకత్వంలో వచ్చిన ఈ అద్భుతమైన సీరియల్‌లో.. అరుణ్ గోవిల్(Arun govil) రాముడిగా, సీతగా దీపిక చిక్లియా(Deepika Chikliya), లక్ష్మణుడిగా సునీల్ లాహ్రీ(Sunil Lahri) నటించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా రామాయణ్ సీరియల్ లక్ష్మణుడిగా చేసిన సునీల్ లాహ్రీ అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాముడిగా, సీతగా చేసిన అరుణ్ గోవిల్, దీపికకు ఆహ్వానపత్రికలు అందాయని, తనకు మాత్రం ఆహ్వానం అందకపోవడం కాస్త నిరాశ కలిగించిందన్నారు.
ఈ విషయం గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.. రామాయణ్ సీరియల్ లో నా పాత్రకు అంత ప్రాధాన్యం లేదని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వాహకులు భావించారేమో. నాతో వారికేమైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయేమో. అయినా.. ఇలాంటి కార్యక్రమాలకు ప్రతిఒక్కరికీ ఆహ్వానం అందాలన్న రూలేమ్ లేదు కదా. కాకపోతే.. చారిత్రాత్మక క్షణాల్లో భాగమయ్యే అవకాశం లభించి ఉంటే సంతోషించే వాడినని.. అంటూ సునీల్ లాహ్రీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.