V6 News

మృతుల ఫ్యామిలీలను ఆదుకుంటం.. గోవా నైట్‌‌ క్లబ్ సహ యజమాని సౌరభ్ లూథ్రా ప్రకటన

మృతుల ఫ్యామిలీలను ఆదుకుంటం.. గోవా నైట్‌‌ క్లబ్ సహ యజమాని సౌరభ్ లూథ్రా ప్రకటన

పణజి: గోవా 'బర్చ్ బై రోమియో లేన్' నైట్‌‌క్లబ్‌‌ అగ్నిప్రమాద ఘటనలో 25 మంది మృతి చెందడంపై క్లబ్‌‌ సహ యజమాని సౌరభ్ లూథ్రా స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం, మద్దతు అందిస్తామని సోమవారం ఇన్‌‌స్టాగ్రామ్‌‌ ద్వారా ప్రకటించారు. అగ్నిప్రమాద ఘటనపై గోవా పోలీసులు ఢిల్లీకి తమ బృందాలను పంపి క్లబ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే ఆయన నుంచి ఈ పోస్ట్ వచ్చింది. 

శనివారం రాత్రి 'బర్చ్ బై రోమియో లేన్' నైట్‌‌క్లబ్‌‎లో అగ్నిప్రమాదం జరగడంతో 20 మంది సిబ్బంది, ఐదుగురు టూరిస్టులు(వీరిలో నలుగురు ఢిల్లీకి చెందినవారు) మరణించారు. మరో 6 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై గోవా పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఎలక్ట్రిక్ ఫైర్‌‌క్రాకర్ల(మెరుపులు చిమ్మే పార్టీ ఎఫెక్ట్ యంత్రాలు)వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. క్లబ్‌‌కు ఫైర్ డిపార్ట్‌‌మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకపోవడంతోపాట మర్జెన్సీ ఎగ్జిట్‌‌లు లేవని..ఇరుకైన ఎంట్రీ/ఎగ్జిట్ మార్గాలు (నారో బ్రిడ్జ్‌‌లు) మాత్రమే ఉపయోగిస్తున్నారని వివరించారు. 

మంటలు మొదటి అంతస్తు(డ్యాన్స్ ఫ్లోర్)లో ప్రారంభమై, సిబ్బంది బేస్‌‌మెంట్‌‌లో చిక్కుకుని ఊపిరాడక మరణించారని గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాపై కూడా కేసు నమోదు చేశారు. వారు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ సర్కులర్ (ఎల్వోసీ) జారీ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. లూథ్రా సోదరులను పట్టుకునేందుకు పోలీసు బృందం ఢిల్లీకి బయలుదేరినట్లు సీఎం ప్రమోద్ సావంత్ ఆదివారమే ప్రకటించారు.