సుప్రీం చెప్పిందదే.. శాపమైన జాప్యం!

సుప్రీం చెప్పిందదే.. శాపమైన జాప్యం!

ఒక తీర్పు అనేక ప్రభావాలు! ఎన్నో సందేహాలకు సమాధానాలు! గతం సమీక్ష, వర్తమాన పరిశీలన, భవిష్యత్తు మార్గదర్శనం. ఒక మనిషి జీవితంలో న్యాయ, శాసన, రాజ్యాంగ పరమైన మూడు పరిస్థితులు గడియారపు లోలకంలా ఒక  కొస నుంచి మరో కొసకు తిరుగుతుంటే, సాక్షీభూతమైన కాలం బతుకు వేళ్ల సందుల్లోంచి  నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలుగా జారిపోతుంటే, మనుగడలో అత్యంత కీలకమైన మూడు దశాబ్దాల విలువైన జీవితాన్ని ఓ యుక్త వయస్కుడు జైలులో గడపాల్సి వచ్చింది. పేగు బంధం నిత్యం నులిపెడుతుంటే, తల్లడిల్లిన ఒక తల్లి అలుపెరుగక బయట జరిపిన సుదీర్ఘ పోరాటమే చివరకు తనయుని ‘విముక్తి’గా  ఫలించిన పతాక సన్నివేశం! 

దివంగత ప్రధాని రాజీవ్​గాంధీ హత్యకేసులో నిందితుడైన ఏజీ పెరరివలన్​కు31 ఏళ్ల తర్వాత  దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రసాదించిన న్యాయమే ఈ విముక్తి! న్యాయస్థానమే విధించిన శిక్ష, శాసన–కార్యనిర్వాహక వ్యవస్థల నిర్వాకాలతో పలు మలుపులు తిరిగి..  మళ్లీ న్యాయస్థానమే చూపిన పరిష్కారం మధ్యలో  ఓ పెద్ద సంఘర్షణ. సుప్రీంకోర్టు ధర్మాసం ఇచ్చిన తాజా తీర్పుతో ఇంత కాలం రగిలిన పలు వివాదాంశాలకు సమాధానం లభించినట్టయింది. కానీ, ఇదే తీర్పుతో..  కేంద్ర–రాష్ట్ర సంబంధాలు వంటి రాజకీయ విషయాల్లో, ఉగ్రవాదం–ఉదారవాదం వంటి సున్నితాంశాల్లో, తమిళులు తరచూ నెత్తికెత్తుకునే ఉప జాతీయవాదం వంటి ఉద్రేక వ్యవహారాల్లో కొత్త వివాదాలు తలెత్తవన్న గ్యారెంటీ ఏం లేదు. ఉత్కంఠ రేపేలా,  ఒక హాలీపుడ్ సినిమా తీయదగ్గ భావోద్వేగాల సమాహారం ఈ కథ!

అనుచిత జాప్యాలు

న్యాయం అందించడంలో జాప్యమంటే, న్యాయ నిరాకరణ కిందే లెక్క. రాజీవ్​గాంధీ హత్య కేసు దర్యాప్తు ప్రతి దశలోనూ కాలం హరించుకుపోయింది.1991 మే 21న, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ ఎన్నికల సభకు హాజరైన రాజీవ్​గాంధీని, మానవబాంబు పేల్చి ఆత్మాహుతి దళం హతమార్చింది. మరో పద్నాలుగు మంది ఈ దుర్ఘటనలో మరణించారు. శ్రీలంక తమిళ ఉగ్రవాద సంస్థ, ఎల్​టీటీయీదే ఈ దురాగతం. లంకలో తమిళులను ఊచకోత కోసిన సింహళ ప్రభుత్వానికి సాయంగా, భారత ప్రధాని హోదాలో శాంతి సైనిక బలగాలను(ఐపీకేఎఫ్) పంపారనే కోపం వల్లే  రాజీవ్ లక్ష్యమయ్యారు. నాడు సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఓ తమిళుడు, డీ.ఆర్.కార్తికేయన్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ఈ కేసు (329/1991)లో  సమగ్ర నేర పరిశోధన చేసి చార్జిషీట్ దాఖలు చేసింది. ‘ఇంత సంచలనం సృష్టించిన కేసులో, ఎందరెందరినో విచారించి, ఎన్నో పత్రాల్ని పరిశీలించి, మరెన్నో సాక్ష్యాధారాల్ని పరీక్షించి అత్యంత వేగంగా దర్యాప్తు ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేశాం’ అని కార్తికేయన్1996లో ఒక టీవీ చానల్ కోసం, నేను మరో జర్నలిస్టు దినమంతా ఇంటర్వ్యూ చేసినపుడు స్వయంగా తెలిపారు. ఈ కేసులో  పెరరివలన్ సహా మొత్తం 26 మంది నిందితులకు1998లో  ‘టాడా’ కోర్టు మరణశిక్షలు విధించింది. వాటిని1999లో సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఆ తర్వాతే, తదుపరి విచారణలు, శిక్షల అమలు, క్షమాబిక్షల పర్వం, తిరస్కరణలు.. కథ అనేక మలుపులు తిరిగింది. నలుగురికి మరణశిక్ష, ముగ్గురికి జీవిత ఖైదు, ఈ ఏడుగురికి తప్ప... మిగిలిన వారి శిక్షలను న్యాయస్థానం తదుపరి దశలో తగ్గించింది. నలుగురి మరణశిక్షను కూడా సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్చింది.

సత్ప్రవర్తనకు ప్రతీక

జైళ్లు శిక్షా నిలయాలు కాకూడదు, పరివర్తన కేంద్రాలు కావాలనే ఆదర్శం అంతటా అమలు కావాలంటే ఖైదీల ప్రవర్తన ఎలా ఉండాలో పెరరివలన్ ఒక ఆదర్శ నమూనా! పెరుంబుదూర్​లో పేలిన బాంబులో వాడిన బ్యాటరీని కొన్నాడని ఆయనపై అభియోగం. తనకు నేరంతో ఏ సంబంధమూ లేదన్నది ఆయన వాదన.  ఒక వైపు న్యాయపోరాటం, మరోవైపు క్షమాబిక్ష వినతులు సాగుతుండగా.. 31 ఏండ్ల జైలు జీవితంలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు. అక్కడే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఖైదీగానే మరో 8 సర్టిఫికెట్ కోర్సులు కూడా చేసి పలువురిని విస్మయపరిచాడు. జైలు లోపల ఆయన నడవడిపై ఏ చిన్న అభియోగం లేదు. రెండు సార్లు పెరోల్​మీద బయటకు వచ్చినా కచ్చితంగా నిబంధనలు, పాటించాడు. అందుకే శిక్షలను తగ్గించాలని, క్షమాబిక్ష ప్రసాదించాలని ఆయా ప్రభుత్వాలు గవర్నర్​కు, రాష్ట్రపతికి  విన్నవించాయి. ఆ వినతుల్లో సాంకేతికమైన  పలు లోపాలు, నిర్ణయాల్లో వైఫల్యాలు, అనుచిత జాప్యాలు చివరకు పెరరివలన్ పాలిట శాపాలయ్యాయి.  మరణ శిక్షను 2014లో సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్చేనాటికే  పెరరివలన్16 సంవత్సరాల జైలు జీవితం గడిపి ఉన్నాడు. రాజ్యాంగంలోని142 అధికరణం కింద తనకున్న విశేషాధికారాల్ని వినియోగించి ఆయనకు సుప్రీంకోర్టు విముక్తి ప్రసాదించింది. 

ఆయన సత్ప్రవర్తన, ప్రభుత్వ సిఫారసులు, రాజ్యాంగ విహితమైన బాధ్యత నిర్వర్తించడంలో గవర్నర్ వ్యవస్థ వైఫల్యం, నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి భవన్​లో జరిగిన అసాధారణ జాప్యం... వంటి అంశాల్ని తన తుది నిర్ణయానికి ప్రాతిపదికగా తీసుకుంది. ఒక రకంగా, మొదట పెట్టుకున్న క్షమాబిక్ష వినతికి రాష్ట్రపతి వ్యవస్థ నుంచి జరిగిన జాప్యం మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గింపునకు దారితీస్తే, గవర్నర్ వ్యవస్థ నిర్వహణలోపం జీవితకాలపు శిక్ష ‘విముక్తి’గా మారేందుకు కారణమైందనుకోవాలి.

ద్రవిడ రాజకీయాలకు తోడు...

కేసు దర్యాప్తు–విచారణలను ద్రవిడ రాజకీయాలు బాగా ప్రభావితం చేశాయి. హత్యకేసు నిందితులకు అనుకూలంగా వ్యవహరించడం నిజానికి తమిళనాడు ప్రధాన స్రవంతి పార్టీలకు కొంత ఇబ్బందికర పరిస్థితే! పీఎమ్​కే, ఎమ్​డీఎమ్కే, వీసీకే, ఎన్​టీకే వంటి పార్టీలు అన్ని వేళలా నిందితులకు మద్దతుగా నిలబడేవి. తమిళ(ఉప)జాతీయతా వాదం తమకు అంటే, కాదు తమకే ఎక్కువని నిరూపించుకునేందుకు, ఈ కేసును భూమిక చేసుకొని చివరకు డీఎమ్​కే, అన్నా డీఎమ్​కేలు కూడా పోటీపడే స్థితి వచ్చింది. రాజీవ్ హత్యకేసు నిందితులకు విముక్తి కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రచారాంశం చేశాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే ముగ్గులోకి దిగాల్సి వచ్చింది. ముందు డీఎంకే అధినేత కరుణానిధిని దేశద్రోహి అని విమర్శించిన జయలలిత, కేంద్ర నిర్ణయంతో నిమిత్తం లేకుండా ఈ కేసు ఖైదీల విడుదలకు కృషి చేస్తానని ప్రకటించి తమిళులను ఆశ్చర్యపరిచారు. మంత్రివర్గ భేటీల్లో నిర్ణయాలు తీసుకొని, గవర్నర్​కు, రాష్ట్రపతికి వేర్వేరు సందర్భాల్లో క్షమాబిక్ష సిఫారసులు చేశాయి. నేర దర్యాప్తు స్మృతి(సీఆర్పీసీ) ప్రకారం ఒకసారి పిటిషన్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక దశలో యూపీఏ ప్రభుత్వం ఇదే విషయమై స్థానిక న్యాయస్థానం తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. స్థానిక ద్రవిడ పార్టీలే కాకుండా ఎన్డీయేకు, యూపీయేకు నేతృత్వం వహించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ కేసు విషయంలో విభిన్నంగా వ్యవహరించాయి.

ఎవరి పరిధులు వారికున్నా..

అధికరణం161 కింద రాష్ట్ర ప్రభుత్వం క్షమాబిక్ష సిఫారసు చేసినపుడు, రాజ్యాంగం కల్పించిన క్షమాధికారాన్ని వినియోగించుకొని, అటో ఇటో గవర్నర్ ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని సుప్రీం చెప్పింది. దాన్ని నాన్చి, రాష్ట్రపతికి పంపడంలో ఔచిత్యం లేదంది. సిఫారసులు చేయడంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలకు, నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి–గవర్నర్లకు ఇంచుమించు సమానాధికారాలున్నాయన్నది తీర్పుసారం.  కానీ, అనుచిత జాప్యాల వల్ల ఒక ఖైదీ 31 ఏండ్లు జైలులో మగ్గాల్సివచ్చింది. ‘ముసలి తల్లిదండ్రులు చనిపోయేలోపు, నాకు విముక్తి దొరికితే బావుండు’ అని పెరరివలన్ మనసులో కోరుకున్నాడు. విముక్తి ఇవ్వకుంటే, కనీసం నా కొడుకు ‘కారుణ్య మరణం’(మెర్సీ కిల్లింగ్)కైనా అనుమతించండని తల్లి అర్పుతమ్మాళ్​ కోరుకుంది. పెరరివలన్ పెళ్లి చేసుకొని, శేషజీవితం ఆనందంగా గడపాలని తాను కోరుకుంటున్నట్టు, ఆయనకు 1999లో మరణశిక్ష విధించిన జస్టిస్ థామస్ కోరుకుంటున్నారు. మెలోడ్రామా అనేది మరెక్కడో లేదు, మన జీవితాల్లోనే ఉంది!!