హైవేలను రోజూ బ్లాక్​ చేస్తే ఎట్ల?.. రైతుల ధర్నాపై సుప్రీం ఆగ్రహం

హైవేలను రోజూ బ్లాక్​ చేస్తే ఎట్ల?.. రైతుల ధర్నాపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ, హర్యానా బార్డర్​లో రైతులు రోజూ హైవేలను బ్లాక్​ చేస్తుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రైతులకు సమస్యలు ఉండొచ్చని, అందుకని రోజూ హైవేలను బ్లాక్​ చేస్తారా అని నిలదీసింది. ఇలాగైతే ఎలాగని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. తాము జోక్యం చేసుకొని ఆదేశాలిస్తే కోర్టు పరిధి దాటుతోందని అంటారని కామెంట్​ చేసింది. కోర్టులు చట్టాల గురించి చెబుతాయని, అమలు చేయాల్సింది ప్రభుత్వాలని గుర్తు చేసింది. జాతీయ రహదారులను దిగ్బంధించడం సమస్యకు పరిష్కారం కాదంది. రోడ్లను బ్లాక్​ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్​ కోర్టులో పిల్​ దాఖలు చేశారు. గతంలో ఢిల్లీ చేరుకోవడానికి 20 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు 2 గంటలకు పైగా పడుతోందని, రైతుల నిరసనల వల్ల జనం ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ పిల్​పై కోర్టు గురువారం విచారణ జరిపింది. 

ఒక్క రోజంటే ఏమో అనుకోవచ్చు..

‘రైతులకు బాధ ఉండొచ్చు. అలాగని రోడ్లు బ్లాక్​ చేస్తే జనాలు కూడా ఇబ్బంది పడతారు. ఒకరోజంటే అనుకోవచ్చు. రోజూ రోడ్లను బ్లాక్​ చేస్తే ఎలా? హైవేలను శాశ్వతంగా బ్లాక్ చేయకూడదు’ అని సుప్రీంకోర్టు కామెంట్​ చేసింది. దీనికి సంబంధించి కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించింది. కేంద్రం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా స్పందిస్తూ.. రైతుల సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించామని, ఆ కమిటీతో చర్చించేందుకు రైతు సంఘాలు నిరాకరించాయని చెప్పింది. పిల్​లో భారత్​ కిసాన్​యూనియన్, నిరసన తెలుపుతున్న ఇతర రైతుల సంఘాలను పార్టీలుగా చేర్చాలని కోర్టును కోరగా పిటిషన్​ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది. విచారణను అక్టోబర్​4వ తేదీకి వాయిదా వేసింది. భారత్​బంద్​ సందర్భంగా సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 40 రైతు సంఘాలు ర్యాలీలు తీశాయి. నిరసన ప్రదర్శనలు ఇచ్చాయి. దీంతో రోడ్లు బ్లాకై ఢిల్లీ, యూపీ, హర్యానా బార్డర్లలో ట్రాఫిక్​కు ఇబ్బంది కలిగింది. ఘజియాబాద్​ పోలీసులు ఢిల్లీలోని నిజాముద్దీన్, ఘజియాబాద్​ హైవేను క్లోజ్​ చేశారు. ​

జడ్జిలుగా 16 మంది పేర్లు ప్రతిపాదించిన కొలీజియం

బాంబే, గుజరాత్​, ఒడిశా, పంజాబ్​ అండ్  హర్యానా హైకోర్టులకు జడ్జిలుగా నియమించేందుకు ఆరుగురు జ్యుడీషియల్​ ఆఫీసర్లు, 10 మంది లాయర్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. బుధవారం జరిగిన మీటింగ్​లో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.