సుప్రీంకోర్టులో ఫొటోలు, వీడియోలు, రీల్స్ బ్యాన్

సుప్రీంకోర్టులో ఫొటోలు, వీడియోలు, రీల్స్ బ్యాన్
  • భద్రతా కారణాల వల్ల నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్లో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ, రీల్స్​తీయడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, న్యాయస్థానం ఆవరణలో ప్రతిరోజూ ఉండే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. పరిపాలనా విభాగం కొత్త గైడ్స్ లైన్స్ ప్రకారం.. సుప్రీంకోర్టు హై-సెక్యూరిటీ జోన్​లో ఏ వ్యక్తి కూడా ఫోన్లో ఫొటోలు తీయడానికి లేదా వీడియోలు, రీల్స్​చేయడానికి అనుమతి లేదు. 

హైసెక్యూరిటీ జోన్​లో మొబైల్ ఫోన్లతో పాటు కెమెరాలు, ట్రైపాడ్లు, సెల్ఫీ స్టిక్లు ఉపయోగించడం కూడా నిషేధం. అనుమతించిన సెక్యూరిటీ జోన్​లో మాత్రమే జర్నలిస్టులు ఇంటర్వ్యూలు, ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్​మెంట్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఒకవేళ మీడియా సిబ్బంది రూల్స్ బ్రేక్ చేస్తే.. నెల రోజులు హై-సెక్యూరిటీ జోన్​లోకి ప్రవేశించకుండా నిషేధం విధించనున్నట్టు తెలిపింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సిబ్బంది, ఇతర విభాగ ఉద్యోగులు కూడా కఠినమైన నిఘాలో ఉంటారని.. వారు కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సుప్రీం హెచ్చరించారు.