పరువు హత్య కేసులో హైకోర్టు బెయిల్.. కొట్టేసిన సుప్రీం

V6 Velugu Posted on Jul 12, 2021

న్యూఢిల్లీ: చెల్లెలిని వేరే కులానికి చెందిన ఫ్రెండ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడని పరువు హత్యకు పాల్పడిన కేసులో నిందితుడికి రాజస్థాన్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆ బెయిల్ మంజూరు చేయడానికి చూపిన కారణాలు ఆమోదింపదగినవి కావని సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ట్రయల్ కోర్టు ఎదుట సరెండ్ కావాలని ఆదేశించారు. అయితే విచారణను ఏడాది లోపు పూర్తి చేయాలని కింది కోర్టుకు సూచించారు.
చెల్లెలి భర్త అమిత్‌ను చంపేశాడు
కేరళకు చెందిన అమిత్‌ నాయర్ అనే యువకుడు సివిల్ ఇంజనీరింగ్ చదివి, రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌‌లో కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాడు. అతడికి జైపూర్‌‌లో ముకేశ్‌ చౌధరి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ముకేశ్‌తో బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయిన అమిత్‌కు తన స్నేహితుడి చెల్లెలు మమత కూడా పరిచయమైంది. అది క్రమంగా ప్రేమగా మారింది. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో 2015లో ఇంటి నుంచి వెళ్లిపోయి పెండ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని మమత తల్లిదండ్రులు జీవన్‌రామ్ చౌధరి, భవాని దేవి తమ అల్లుడిపై కోపం పెంచుకున్నారు. జైపూర్‌‌లోనే ఉంటున్న అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2017 మే నెలలో ముకేశ్, మరికొందరు కిరాయి గుండాలు కలిసి అమిత్‌ ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్చి చంపారు.

దీనిపై అమిత్ నాయర్ తల్లి రమాదేవి 2017 మే 17న జైపూర్‌‌లో కంప్లైంట్‌ చేసింది. దీంతో  జైపూర్‌‌ పోలీసులు మర్డర్ కేసు పెట్టి ముకేశ్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా ట్రయల్ ఖైదీగా జైలులో ఉన్న ముకేశ్‌ చౌధరి రాజస్థాన్‌ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. ఇటీవలే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అతడి చెల్లెలు మమతా నాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తన అన్న బెయిల్ రద్దు చేయాలని, భర్త అమిత్‌ను కిరాతకంగా చంపి తన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టిన సోదరుడిని కఠినంగా శిక్షించాలని వాదనలు వినిపించింది. దీంతో ఈ కేసును సోమవారం విచారించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. నిందితుడి బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ముకేశ్‌ను ట్రయల్‌ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించారు. ఆ కేసు విచారణను వేగవంతం చేసి, ఏడాదిలోగా తేల్చాలని ట్రయల్ కోర్టుకు సూచించారు.

Tagged bail, SupremeCourt, HonourKilling, FriendLove, InterCasteMarriage, CJI NV Ramana, Friend Murder

Latest Videos

Subscribe Now

More News