
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
న్యూఢిల్లీ: డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. డిజిటల్ యాక్సెస్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి.
ఓ యాసిడ్ బాధితురాలు తాను బ్యాంక్‌లో కేవైసీ పూర్తిచేసే సమయంలో ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ పిల్ ఫైల్ చేసింది. వీటిపై జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. డిజిటల్ అంతరాన్ని తగ్గించడమనేది ఇకపై విధానపరమైన అంశానికి సంబంధించినది కాదని, రాజ్యాంగం కల్పించిన గౌరవప్రదమైన జీవితం పొందే హక్కుకు సంబంధించినదని బెంచ్ పేర్కొంది.
‘‘ప్రస్తుత కాలంలో ప్రభుత్వ, విద్య, వైద్య, ఆర్థిక సేవలతో పాటు ఇతరత్రా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే అందుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆర్టికల్ 21 కింద రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును సాంకేతిక వాస్తవాలతో అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో కొంతమందికి మాత్రమే డిజిటల్ సేవలు అందుతున్నాయి. వివిధ కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, దివ్యాంగులు వాటిని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ సేవలు అందరికీ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించింది.
ఇదీ కేసు..
యాసిడ్ బాధితురాలు ప్రగ్యా ప్రసూన్ 2023 జులైలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లింది. డిజిటల్ కేవైసీ ప్రాసెస్‌లో భాగంగా ఫొటో దిగేటప్పుడు కండ్లను బ్లింక్ చేయాలని బ్యాంక్ అధికారులు అడిగారు. యాసిడ్ దాడిలో ప్రగ్యాకు ఓ కన్ను పాడైపోవడంతో, ఆమె బ్లింక్ చేయలేకపోయింది. దీంతో బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు. దీనిపై విమర్శలు రావడంతో బ్యాంక్ అధికారులు ఆమెకు మినహాయింపునిచ్చి అకౌంట్ ఇచ్చారు. కాగా, తనలాంటి బాధితుల కోసం కేవైసీ రూల్స్‌ను సవరించాలంటూ ప్రగ్యా సుప్రీంను ఆశ్రయించింది.