- 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు
- ఇద్దరు నేరానికి పాల్పడినట్లు ఆధారాలున్నయ్
- ఇలాంటి దశలో బెయిల్ ఇవ్వలేమన్న ధర్మాసనం
- మిగిలిన ఐదుగురికి బెయిల్ మంజూరు చేసిన బెంచ్
న్యూఢిల్లీ: 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న స్టూడెంట్ యూనియన్ నేతలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు, మిగిలిన ఐదుగురు నిందితులకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది.
‘‘ఈ కుట్ర కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ నేరానికి పాల్పడినట్లు బలమైన ఆధారాలున్నాయి. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు భిన్నమైనవి. ఇలాంటి దశలో వారికి బెయిల్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదు’’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
పక్కా ప్లాన్‌తోనే అల్లర్లు సృష్టించిన్రు!
ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌పై ఉన్న ఆరోపణలు ప్రాథమికంగా నిజమని కోర్టు భావించినట్లు జస్టిస్ అర్వింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం తెలిపింది. వీళ్లు అల్లర్ల ప్రణాళికలో, జనాలను పోగు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు సాక్ష్యాలు చెప్తున్నాయని చెప్పారు.
నిందితులందరినీ ఒకే కోణంలో చూడలేమని కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పొందిన ఐదుగురి పాత్రతో పోలిస్తే, ఖాలిద్, ఇమామ్ చేసిన పనులు మరింత తీవ్రమైనవని ధర్మాసనం అభిప్రాయపడింది. గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
ఇద్దరికి ప్రస్తుతానికి బెయిల్ నిరాకరించినప్పటికీ, మరో ఏడాది లేదా కేసులో సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది.
కాగా.. 2020, ఫిబ్రవరిలో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నార్తీస్ట్ ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాకాండలో 53 మంది చనిపోయారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఇది అనుకోకుండా జరిగిన అల్లర్లు కావని.. దేశాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన పెద్ద కుట్ర అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
