గోప్యత హక్కును కాపాడుకోవాలె

గోప్యత హక్కును కాపాడుకోవాలె


పెగాసస్ వ్యవహరంపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. నిపుణుల కమిటీ పని తీరును తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ R.V. రవీంద్రన్ నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా అలోక్ జోషి, సందీప్ ఓబెరాయి ఉండనున్నారు. ఆరోపణలపై స్టడీ చేసి రిపోర్టును సమర్పించాలని కమిటీని కోరింది సుప్రీంకోర్టు. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. 

రైట్ టూ ప్రైవసీని కాపాడాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా తెలిపింది సుప్రీంకోర్టు. పెగాసస్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశామని గుర్తు చేసింది సుప్రీంకోర్టు. సరిపడా సమయం ఇచ్చినప్పటికీ కేంద్రం తగినంత సమాచారం ఇవ్వలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్ ను విచారణకు స్వీకరించడం తప్ప తమ ముందు మరో ఆప్షన్ లేదని తెలిపింది. కేంద్ర క్లారిటీ ఇచ్చి ఉంటే తమపై భారం తగ్గేదని కామెంట్ చేసింది. పౌరులపై నిఘా విషయంలో ఫారిన్ ఏజెన్సీల ప్రమేయం ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలిపింది సుప్రీంకోర్టు. మొదట న్యూస్ పేపర్ లో వచ్చిన కథనాల ఆధారంగా వేసిన పిటిషన్లతో సంతృప్తి చెందలేదని తెలిపింది. కానీ తర్వాత కొందరు ప్రత్యక్ష బాధితులు కూడా పిటిషన్ వేసినట్లు తెలిపింది. ప్రస్తుతం సమాచార యుగంలో ఉన్నామన్న సుప్రీంకోర్టు టెక్నాలజీ ఇంపార్టెన్స్ ను గుర్తించాలని తెలిపింది. 

కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరపాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, సుప్రీంకోర్టు లాయర్ ML శర్మ, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సహా  పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.