అలా అబార్షన్ చేయటానికి కుదరదు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అలా అబార్షన్ చేయటానికి కుదరదు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

బతికే అవకాశాలున్న పిండాన్ని తాము చంపలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ మహిళకు 26 వారాల అబార్షన్ కు అనుమతినివ్వాలంటూ.. చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది.

కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారా? అని సీజేఐ ప్రశ్నించారు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఈ పిండాన్ని తాము చంపలేమని స్పష్టం చేశారు. 

కేసు ఏంటంటే..

ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత అబార్షన్ చేయించుకునేందుకు అనుమతించాలని.. ఆర్థిక, మానసిక ఇబ్బందుల కారణంగా 26 వారాల గర్భాన్ని తొలగించాలని మహిళ సుప్రింకోర్టును కోరింది. అయితే ఈ పిటిషన్ పై మొదట విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. అబార్షన్ చేసుకునేందుకు అక్టోబర్ 9న ఆమెకు అనుమతినిచ్చింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది.  

తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందని.. ఆ పిండం సజీవంగా ఉందని.. బతికే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇప్పుడు ఆ పిండం గుండె చప్పుడును ఆపమని మేమే ఎయిమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? ఆ బిడ్డను మేం చంపలేం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

దీంతో కోర్టు అబార్షన్‌ను వ్యతిరేకిస్తూ సోమవారం(అక్టోబర్ 16) తీర్పునిచ్చింది. మహిళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, MTP (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ)ని అనుమతించలేమని సుప్రింకోర్టు స్పష్టం చేసింది.