సుప్రీంకోర్టులో మహిళా ధర్మాసనం.. చరిత్రలో మూడోసారి..

సుప్రీంకోర్టులో మహిళా ధర్మాసనం.. చరిత్రలో మూడోసారి..

సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. సుప్రీం చరిత్రలోనే మహిళా న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేయడం ఇది మూడోసారి. 

2013లో తొలిసారి జస్టిస్‌ జ్ఞానసుధా మిశ్రా, జస్టిస్‌ రంజనా ప్రసాద్‌ దేశాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. అప్పటి ప్రిసైడింగ్‌ జడ్జి జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలమ్‌ గైర్హాజరుతో మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018లో జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కూడిన మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. తాజాగా మరోసారి మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటైంది. 

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27మంది న్యాయమూర్తులుండగా.. అందులో ముగ్గురు మాత్రమే మహిళా జడ్జిలున్నారు. జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ బేలా త్రివేది గతేడాది ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. జస్టిస్‌ బీవీ నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. 2027లో ఆమె 36 రోజుల పాటు సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. అదే జరిగితే.. సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.