తాత ఆస్తిలో మనవడికి హక్కు లేదు..తాత ఆస్తి పంపకాల్లో తండ్రికి వచ్చిన భూమి ఆయన సొంతం : సుప్రీంకోర్టు

తాత ఆస్తిలో మనవడికి హక్కు లేదు..తాత ఆస్తి పంపకాల్లో తండ్రికి వచ్చిన భూమి ఆయన సొంతం : సుప్రీంకోర్టు
  • తండ్రి అమ్మినదాంట్లో సగం వాటా కోరిన కొడుకు అప్పీల్ కొట్టివేత
  • మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: తాత ముత్తాతల ఆస్తుల వారసత్వ హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. తాత ఆస్తి పంపకాల ద్వారా తండ్రి చేతికి దక్కిన తర్వాత, ఆ ఆస్తిపై మనవడికి పుట్టుకతో ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. 1956 హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 8 ప్రకారం తండ్రికి దక్కిన వాటా ఆయన స్వార్జితం కిందకే వస్తుందని, తండ్రి బతికి ఉండగానే ఆ ఆస్తిలో సగం వాటా కావాలంటూ మనవడు కోరేందుకు చట్ట ప్రకారం అర్హత లేదని తేల్చిచెప్పింది.

వీలునామా రాయకుండా చనిపోయిన హిందూ పురుషుడి ఆస్తి హిందూ వారసత్వ చట్టం–1956లోని సెక్షన్ 8 ప్రకారం క్లాస్–1 వారసులకు చెందుతుందని, ఆ జాబితాలో మనవడి పేరే లేదని గుర్తుచేసింది. తండ్రి బతికుండగానే ఆయన వాటా భూమిలో సగ భాగం తనకు ఇప్పించాలంటూ ఓ కొడుకు వేసిన అప్పీల్‌‌‌‌ను ధర్మాసనం కొట్టివేసింది.

కేసు నేపథ్యం ఇది..

చెన్నైకి చెందిన ఈ కేసులో పిటిషనర్ మేనత్త తమ తండ్రి (పిటిషనర్ తాత) ఆస్తి పంపకం కోసం దావా వేశారు. 1994లో రాజీ ఒప్పందం ఆధారంగా కోర్టు డిక్రీ ఇవ్వగా, ఆ పంపకంలో పిటిషనర్ తండ్రికి భూమి వచ్చింది. పిటిషనర్ అదే ఏడాది పుట్టాడు. 1997లో తండ్రి ఆ భూమిని ఇద్దరికి అమ్మేశాడు. అదే ఏడాది మైనర్‌‌‌‌గా ఉన్న కొడుకు తరఫున తల్లి కోర్టులో దావా వేశారు.

ఆ భూమి తాత నుంచి వచ్చిన ఉమ్మడి కుటుంబ ఆస్తి అని, తండ్రి ద్వారా తనకూ సగం వాటా వస్తుందని కొడుకు వాదించాడు. సిటీ సివిల్ కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, అప్పీలేట్ కోర్టు దాన్ని కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు కూడా తండ్రి ఆస్తిలో కొడుకుకు జన్మహక్కు లేదని తేల్చింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

పంపకంతో ఉమ్మడి ఆస్తి కాదు

తాత చనిపోగానే ఆయన ఆస్తి క్లాస్–1 వారసులకు చెందిందని, అది తండ్రి కుటుంబ శాఖకు చెందిన హిందూ అవిభాజ్యం కుటుంబం (హెచ్‌‌‌‌యూఎఫ్) ఆస్తి కాలేదని ధర్మాసనం పేర్కొంది.హిందూ వారసత్వ చట్టం రాకముందు వ్యక్తిగత హిందూ చట్టంలో ఉన్న ‘తండ్రి బతికుండగానే తాత ఆస్తిలో మనవడికి హక్కు’ను 1956 చట్టంలో శాసనకర్తలు ప్రత్యేకంగా కాపాడలేదని గుర్తుచేసింది.

తాత చనిపోయింది పిటిషనర్ పుట్టకముందే కాబట్టి, అతడు ‘మిగిలి ఉన్న సమభాగస్వామి’(కోపార్సనర్) కాలేడని, సెక్షన్ 6 గానీ, తమిళనాడు సవరణ చట్టంలోని సెక్షన్ 29ఏ గానీ ఈ కేసుకు వర్తించవని స్పష్టం చేసింది. పైగా పంపకం డిక్రీని, తండ్రి చేసిన అమ్మకపు దస్తావేజులను పిటిషనర్ సవాల్ చేయలేదని పేర్కొంది.