వరవరరావుకు శాశ్వత బెయిల్ మంజూరు

వరవరరావుకు శాశ్వత బెయిల్ మంజూరు

సామాజిక ఉద్యమకారుడు, విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోర్టు వరవరరావుకు శాశ్వత బెయిల్ ను మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది.  2018లో జరిగిన భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న విప్లవ రచయిత వరవరరావు ఇప్పటికే పలుమార్లు శాశ్వత బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. కానీ ఆయనకు అనుకూలంగా ఇప్పటివరకూ తీర్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే 82ఏళ్ల వరవరరావుకు తాజాగా శాశ్వత బెయిల్ కు అంగీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 

మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న అభియోగాలతో వరవర రావును 2018 ఆగస్ట్ లో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లను పుణే పోలీసులు నిర్భందించారు. అయితే గత కొంతకాలం నుంచి వైద్య కారణాల రిత్యా వరవరరావు తాత్కాలిక బెయిల్ లో ఉన్నాడు. అనారోగ్య కారణాల కారణంగా తనకు శాశ్వత బెయిల్ కావాలని ఇప్పటికే ఆయన పలుమార్లు కోర్టులో పిటిషన్లు వేశారు. కాగా ఈ నేపథ్యంలోనే వరవరరావుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తెలిపింది.