గంగూలీ, జై షాకు ఊరట

గంగూలీ, జై షాకు ఊరట
  • స్టేట్‌‌‌‌, బీసీసీఐలో ఆరేళ్ల చొప్పున.. 
  • ‘కూలింగ్‌‌’ తొలగింపునకు సుప్రీం ఓకే

న్యూఢిల్లీ: కూలింగ్‌‌‌‌ ఆఫ్‌‌ పీరియడ్‌‌ (పదవుల మధ్య విరామం)కు సంబంధించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించేందుకు సుప్రీంకోర్టు బుధవారం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. ఆఫీస్‌‌ బేరర్‌‌ వరుసగా 12 ఏళ్లు పదవిలో కొనసాగొచ్చని జస్టిస్‌‌ డీవై చంద్రచూడ్‌‌, జస్టిస్‌‌ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాష్ట్ర అసోసియేషన్‌‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్ల చొప్పున.. నిరంతరాయంగా 12 ఏళ్లు పదవిలో కొనసాగొచ్చని ఆదేశాలు జారీ చేసింది. ‘ఓ ఆఫీస్‌‌ బేరర్‌‌.. బీసీసీఐ, స్టేట్‌‌ అసోసియేషన్లలో వరుసగా రెండు పర్యాయాలు నిర్ధిష్ట పదవిలో కొనసాగొచ్చు. ఆ తర్వాత అతను మూడేళ్ల విరామం తీసుకోవాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ, సెక్రటరీ జై షాకు ఎనలేని ఊరట లభించింది. మినిస్టర్స్‌‌, గవర్నమెంట్‌‌ ఉద్యోగులు, గవర్నమెంట్‌‌ కార్యాలయాల్లో పని చేస్తున్న వ్యక్తులు బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి సంబంధించిన క్లాజ్‌‌ను కూడా ధర్మాసనం సవరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న వ్యక్తులను అనర్హత పరిధి నుంచి తొలగించింది. ‘బీసీసీఐ పిటీషన్‌‌ను పరిశీలించిన తర్వాత ప్రతిపాదిత సవరణలను ఆమోదించాలని మేం భావిస్తున్నాం’ అని బెంచ్‌‌ పేర్కొంది.  బోర్డు గత రాజ్యాంగం ప్రకారం ఏ ఆఫీస్‌‌ బేరరైనా వరుసగా రెండు పర్యాయాలు (మూడేళ్ల చొప్పున) స్టేట్‌‌, బీసీసీఐ పదవుల్లో ఉంటే కచ్చితంగా మూడేళ్ల విరామం తీసుకోవాలి. ఆ తర్వాతే మళ్లీ పోటీ చేసే చాన్స్‌‌ ఉంటుంది. ఈ నిబంధనను అమలు చేస్తే గంగూలీ, జై షా పదవుల్లో కొనసాగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దాదా, షా.. బెంగాల్‌‌, గుజరాత్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్లలో మూడేళ్లు పని చేసి ఉన్నారు. గత మూడేళ్ల నుంచి బీసీసీఐలో పని చేస్తున్నారు. అంటే ఆరేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. ఈ క్రమంలో కూలింగ్‌‌ పీరియడ్‌‌ను తొలగించాలని 2019 డిసెంబర్‌‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ప్రతిపాదించింది. ఆ మేరకు రాజ్యాంగ సవరణ కోరుతూ 2020లో సుప్రీంకోర్టులో పిటీషన్‌‌ దాఖలు చేసింది. 

మరో మూడేళ్లు..
తాజా తీర్పుతో గంగూలీ, షా మరో మూడేళ్లు కచ్చితంగా పదవుల్లో కొనసాగే చాన్స్‌‌‌‌ ఉంది. అయితే వీళ్లలో ఎవరు ఏ పదవిలో ఉంటారనే అంశంపై కూడా ఇప్పుడు ఉత్కంఠ మొదలైంది. సుప్రీం తీర్పు తర్వాత ఏజీఎమ్‌‌ను ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ఎలక్షన్స్‌‌ను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘బీసీసీఐ ఏజీఎమ్‌‌లో పరిస్థితులు చాలా మారతాయి. లోధా సిఫారసులు ఇబ్బందికరంగా ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఎలక్షన్స్‌‌కు వెళ్లి బోర్డులో మునుపటి పరిస్థితిని తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టొచ్చు. అయితే గంగూలీ అదే పోస్ట్‌‌లో ఉంటాడా? లేక జై షాను ప్రెసిడెంట్‌‌ను చేస్తారా? తేలాల్సి ఉంది. ఒకవేళ దాదా ఐసీసీకి వెళ్తే కచ్చితంగా భారీ మార్పులు ఉంటాయి. రాబోయే రోజుల్లో ఈ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు.  అయితే వయో పరిమితిపై ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో కాస్త ఉత్కంఠ మొదలైంది. ఎందుకంటే బీసీసీఐ మాజీ బాస్‌‌ ఎన్‌‌. శ్రీనివాసన్‌‌ దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.