ఉచిత హామీలపై సూచనల కోసం కమిటీ 

 ఉచిత హామీలపై సూచనల కోసం కమిటీ 
  • ఉచితమేదో, సంక్షేమమేదో తేల్చాలి
  • సూచనలు ఇచ్చేందుకు కమిటీ వేస్తం: సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ


‘ఉచితం’ అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉంది. జాతీయ ఉపాధి హామీ స్కీం, ఫ్రీ డ్రింకింగ్​ వాటర్, ఎడ్యుకేషన్​, హెల్త్​ వంటి హామీలను ఉచితాలుగా చెప్పలేం. ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని కూడా అనలేం. ఉచిత వాగ్దానాలు చేసినా ఎలక్షన్స్​లో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేం. ఏది సంక్షేమమో, ఏది ఉచితమో తేల్చుడు కష్టం. ఈ విషయంతో సంబంధం ఉన్న సంస్థలు, పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించి, ఉన్నత స్థాయి కమిటీకి తెలిపి సహకరించాలి.


-  సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ

 

 

న్యూఢిల్లీ: పథకాలలో సంక్షేమమేదో, ఉచితమేదో తేల్చాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ అన్నారు. ఇది చాలా కాంప్లికేటెడ్​గా ఉందని, ప్రజల సంక్షేమం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఓటర్లకు ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నియంత్రించాలని కోరుతూ అడ్వొకేట్​ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. 

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ, జస్టిస్​ జేకే మహేశ్వరీ, జస్టిస్​ హిమా కోహ్లీతో కూడిన బెంచ్​ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో ఖర్చు చేయడమే ఇక్కడ ప్రధాన అంశం. ‘ఉచితం’ అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉంది. జాతీయ ఉపాధి హామీ స్కీం, ఫ్రీ డ్రింకింగ్​ వాటర్, ఎడ్యుకేషన్​, హెల్త్​ వంటి హామీలను ఉచితాలుగా వర్ణించలేం. ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని కూడా చెప్పలేం. ఉచిత వాగ్దానాలు చేసినా ఎలక్షన్స్​లో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఈ అంశాన్ని పరిశీలించే సామర్థ్యం న్యాయ స్థానానికి ఉందా..? అనే ప్రశ్న కూడా ముందుకు వస్తున్నది..” అని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ అన్నారు. ఉచిత వాగ్దానాల సమస్య జఠిలమవుతుందన్న జస్టిస్‌ ఎన్వీ రమణ, అసలు ఉచిత హామీ, వెల్ఫేర్​ స్కీం అని తేల్చేది ఎలా అంటూ ప్రశ్నించారు. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై మరింత చర్చ జరగాలని, దీని కోసం కమిటీ ఏర్పాటు చేయాలని బెంచ్ భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

22వ తేదీకి విచారణ వాయిదా

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెల్ఫేర్​ స్కీంలను ఉచితాలుగా పేర్కొనలేమని డీఎంకే వాదిం చింది. దీనిపై సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా స్పందిస్తూ.. ‘‘ఉచిత హామీల అంశం పై సిబల్​, వికాస్​ సింగ్​లు ఇప్పుడు ఎలాంటి సూచనలు ఇవ్వలేరు. అందుకే దీనిపై రేపు విచారిద్దాం” అని చెప్పారు. దీనిపై పిటిషనర్​ స్పందిస్తూ.. ‘‘సుప్రీం కోర్టు ఈ అంశాన్ని పరిగణ లోకి తీసుకుని ఓ కమిటీ వేయాలని” కోరారు. 

డీఎంకే తరఫు అడ్వొకేట్​ పి.విల్సన్​ మాట్లాడు తూ.. ‘‘ఇండియా సోషలిస్ట్​ వెల్ఫేర్​ స్టేట్. మేము ఇంటర్​వెన్షన్​ అప్లికేషన్​ ఫైల్​ చేశాం. సంక్షేమ పథకాలు కీలకం. కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం” అని చెప్పారు. మీకు వ్యతిరేకించే అర్హత ఉందని, అలా అని మేము ఆర్డర్​ పాస్​ చేయకుండా ఉండలేం అని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో కొన్ని పార్టీలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని కొందరు విమర్శిస్తున్నారని, కానీ వాటినే మరికొందరు వెల్ఫేర్​ స్కీంలు అంటున్నారని అభిప్రాయపడ్డారు.


అందుకే ఉచితాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. శనివారంలోగా తమ సూచనలు తెలియజేయాలని రాజకీయ పార్టీలను ఆదేశిస్తూ.. విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు.  అశ్వినీ ఉపాధ్యాయ్​ పిటిషన్​ను ఆమ్​ ఆద్మీ పార్టీ తరఫు అడ్వొకేట్​ ఏఎం సింఘ్వీతో పాటు మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ లీడర్​ జయ ఠాకూర్​  వ్యతిరేకించారు.