వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ బకాయిల చెల్లింపు విషయంలో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ బకాయిల చెల్లింపు విషయంలో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపు విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారంటూ సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్, జస్టిస్​ పీఎస్ నరసింహా, జస్టిస్​ జేబీ పార్ధివాలాతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. వన్‌‌‌‌ నేషన్‌‌‌‌ – వన్‌‌‌‌ పెన్షన్‌‌‌‌ని 4 వాయిదాల్లో చెల్లించాలని జనవరి 20న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. తాము ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రక్షణ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. 

గడువు కోరిన అటార్నీ జనరల్

కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఓఆర్ఓపీ బకాయిల మొదటి విడత చెల్లించిందని, మరో విడత చెల్లించేందుకు కొంత టైం కావాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ‘‘బకాయిల చెల్లింపుల విషయమై జనవరి 20న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోండి. తర్వాతే మీ పిటిషన్​ను పరిశీలిస్తాం” అని స్పష్టం చేసింది. ముందుగా వృద్ధులకు బకాయిలు చెల్లించాలని కోరుతున్నామని ధర్మాసనం తెలిపింది.

డిఫెన్స్​ ఉత్తర్వులపై ఐఈఎస్ఎం సవాల్

జనవరి 9న, ఓఆర్​ఓపీ మొత్తం బకాయిల చెల్లింపు కోసం సుప్రీం కోర్టు మార్చి 15 దాకా కేంద్రానికి గడువు ఇచ్చింది. బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లించాలని రక్షణ మంత్రిత్వ శాఖ జనవరి 20న ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఇండియన్ ఎక్స్​సర్వీస్​మెన్​ మూవ్​మెంట్ (ఐఈఎస్ఎం) సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.