క్లయింట్లకు సలహాలపై లాయర్లకు సమన్లు ఇవ్వొద్దు: దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం

క్లయింట్లకు సలహాలపై లాయర్లకు సమన్లు ఇవ్వొద్దు: దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: న్యాయవాది, క్లయింట్ గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమ క్లయింట్లకు న్యాయ సలహా అందించినంత మాత్రానా న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయలేవని తేల్చి చెప్పింది. ఒకవేళ ఏదైనా బలమైన కారణం ఉంటే, ఉన్నత స్థాయిలో ఆమోదం తీసుకుని సమన్లు జారీ చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ శుక్రవారం తీర్పు ఇచ్చింది. 

‘‘ఏ దర్యాప్తు ఏజెన్సీ కూడా న్యాయవాదిని తన క్లయింట్ వివరాలు అడగడానికి వీల్లేదు. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ, డాక్యుమెంట్ల సమర్పణ, న్యాయ సలహాకు సంబంధించిన వివరాలేవీ అడగవద్దు. కేవలం బీఎస్‌‌ఏ సెక్షన్ 132లో పేర్కొన్న అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే న్యాయవాదికి సమన్లు జారీ చేయవచ్చు. తన క్లయింట్ నేరం, మోసానికి పాల్పడటంలో న్యాయవాది సహాయం చేసినట్టు లేదా చట్టవిరుద్ధమైన చర్యలను ప్రోత్సహించినట్టు ఆధారాలుంటే నోటీసులు ఇవ్వవచ్చు.

అయితే అందుకు తగిన కారణాలు, ఆధారాలను జత చేయాలి. ఒకవేళ న్యాయవాదికి సంబంధించిన ల్యాప్‌‌టాప్, ఫోన్, ఇతర ఏవైనా డిజిటల్ డివైజ్‌‌లు దర్యాప్తు సంస్థ కావాలనుకుంటే.. ముందుగా వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. న్యాయవాది, అతని క్లయింట్, వాళ్లకు నచ్చిన సాంకేతిక నిపుణుడి సమక్షంలోనే వాటి నుంచి డేటాను తీయాలి. తప్పు చేసినప్పుడు విచారణ నుంచి న్యాయవాదులకు ఎలాంటి మినహాయింపు లేదు. కానీ న్యాయవాద వృత్తికి రక్షణ కల్పించేందుకే ఈ ఆదేశాలు ఇస్తున్నాం” అని తీర్పులో పేర్కొంది.