ఢిల్లీలో కశ్మీర్ జెండా ఎగురవేస్తామంటూ బెదిరింపు కాల్స్

ఢిల్లీలో కశ్మీర్ జెండా ఎగురవేస్తామంటూ బెదిరింపు కాల్స్
  • ఆర్టికల్‌‌ 370 రద్దుపై ఇండియన్‌‌ ముజాహిదీన్‌‌ ఫోన్‌‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు లాయర్లకు మళ్లీ బెదిరింపు కాల్స్‌‌ వచ్చాయి. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌‌ 370 రద్దుపై ఇండియన్‌‌ ముజాహిదీన్‌‌ గ్రూప్‌‌కు చెందిన సభ్యులు సోమవారం ఫోన్‌‌ చేసి బెదిరించినట్లు లాయర్లు చెప్పారు. జనవరి 26న ఢిల్లీలో కశ్మీర్‌ జెండాను ఎగురవేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. నెలలో బెదిరింపు కాల్స్‌‌ రావడం ఇది మూడోసారి అని తెలిపారు.

‘‘మేం మా పోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం. కశ్మీర్‌ ప్రజల హక్కులకు విరుద్ధంగా ఆర్టికల్‌‌ 370ని తొలగించారు. ఈ విషయంలో కేంద్రానికి ఎంత బాధ్యత ఉందో.. సుప్రీంకోర్టుకూ అంతే ఉంది. కశ్మీర్‌ స్వాత్రంత్యం కోసం ఢిల్లీలో మేం చేసే పోరాటం ప్రపంచం మొత్తం చూస్తుంది. ‘సిఖ్స్‌‌ ఫర్‌ జస్టిస్‌‌’ అనే సంస్థ కూడా తన పోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్తోంది” అని కాల్‌‌ రికార్డింగ్‌‌లో ఉంది. అలాగే జనవరి 26న ప్రధాని మోడీని బ్లాక్‌‌ చేస్తామని చెప్పారు. పంజాబ్‌‌లో మోడీ భద్రతకు సంబంధించిన కేసును విచారించేందుకు జస్టిస్‌‌ ఇందూ మల్హోత్రాను అనుమతించబోమని వారు స్పష్టం చేశారు.