కాలినడకన వెళ్లే వారి భద్రతకు..రూల్స్ చేయండి..అన్ని రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

కాలినడకన వెళ్లే వారి భద్రతకు..రూల్స్ చేయండి..అన్ని రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
  • ఎంవీఐ యాక్ట్ ప్రకారం నిబంధనలు.. ఆరు నెలలు గడువు    

న్యూఢిల్లీ, వెలుగు: రోడ్ల వెంబడి కాలినడన వెళ్లే వారి భద్రత, ఫుట్ పాత్ లు, రోడ్డు డిజైన్ ల కోసం మోటర్ వాహనాల చట్టం(ఎంవీఏ) కింద రూల్స్ రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్ రాజశీకరన్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసుతోపాటు ఇతరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

 మోటార్ వెహికల్ యాక్ట్ లోని సెక్షన్ 138(1ఏ) కింద రహదారుల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ ప్రమాణాల కోసం ఆరు నెలల్లో ఈ నియమాలను రూపొందించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా సెక్షన్లు 138(నియమాలు రూపొందించడానికి రాష్ట్రప్రభుత్వానికి అధికారం), 198 (రహదారి రూపలక్పన, నిర్మాణం, నిర్వహణ ప్రమాణాలు పాటించడంలో వైఫల్యం), 210 సీ, డీ ప్రకారం నియమాలు రూపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, 2020లో సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను బెంచ్ గుర్తు చేసింది. 

ఈ సందర్భంగా జస్టిస్ పార్థీవాలా స్పందిస్తూ.. ఈ గైడ్ లైన్స్ ను ఎలా అమలు చేస్తారనే దానిపైనే అంతా ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. పాదచారుల భద్రతను ప్రాథమిక హక్కుగా గుర్తించి, సురక్షితమైన, అవరోధం లేని ఫుట్ పాత్ లను ఏర్పాటు చేయాలని ఇదే పిటిషన్ పై గత విచారణ సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వికలాంగుల హక్కుల చట్టం– 2016, ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్(ఐఆర్ఎస్) ప్రమాణాలకు అనుగుణంగా గైడ్ లైన్స్ రూపొందించాలని స్పష్టం చేసింది.