40 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేతకు సుప్రీం కోర్టు ఆదేశం

40 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేతకు సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఢిల్లీ – ఎన్సీఆర్ ఏరియాలో కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ సూపర్ టెక్‌కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. నోయిడాలో సూపర్ టెక్ ఎమరాల్డ్ కోర్ట్ పేరుతో ఆ సంస్థ నిర్మించిన రెండు టవర్లను కూల్చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ రెండు టవర్లను 40 అంతస్థుల వరకు కట్టగా.. వాటిల్లో  వెయ్యి వరకు ఫ్లాట్స్ ఉన్నాయి. టవర్ల నిర్మాణంలో సూపర్ టెక్ సంస్థ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని సుప్రీం తేల్చింది. నోయిడా అథారిటీ నుంచి ఎటువంటి పర్మిషన్ రాకముందే సూపర్‌‌టెక్ ఎమరాట్డ్‌ కోర్ట్ టవర్స్‌ నిర్మాణం మొదలుపెట్టేశారని, దీని గురించి తెలిసినా అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ధర్మాసనం గుర్తించింది. నోయిడా అథారిటీ అధికారులు, కన్‌స్ట్రక్షన్ కంపెనీ కుమ్మక్కయాయని ఇప్పటికే హైకోర్టు తేల్చిన విషయంలో వాస్తవం ఉందని పేర్కొంది. 

ఫ్లాట్స్ కొన్నవారికి 12 వడ్డీతో డబ్బు కట్టాలి

సూపర్‌‌టెక్ ఎమరాల్డ్‌ కోర్ట్ టవర్స్‌ను రెండు నెలల్లోపు కూల్చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా సూపర్ టెక్ సంస్థే భరించాలని స్పష్టం చేసింది. ఈ టవర్స్‌లో ఫ్లాట్స్ కొనుగోలు చేసినవారికి కట్టిన డబ్బుతో పాటు 12 శాతం వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. కూల్చవేత సమయంలో ఇతర బిల్డింగ్స్‌కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్‌‌ టెక్‌ కంపెనీకి సూచించారు.