తీహార్ జైలు అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

తీహార్ జైలు అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • యూనిటెక్ సంస్థ మాజీ ప్రమోటర్లు జైలు నుంచి బిజినెస్ చేసుకునేందుకు సహకరిస్తున్నారని అభియోగం

న్యూఢిల్లీ: తీహార్ జైలు అధికారులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖైదు చేయబడిన వారు బయటి ప్రపంచంలోని వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు సహకరించడం క్షమార్హం కాదని పేర్కొంటూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న జైలు అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశించింది. ఆర్ధిక నేరాల కేసులో ఇరుక్కుని జైలు పాలైన యూనిటెక్ సంస్థ ఒకనాటి యజమానులు, మాజీ ప్రమోటర్లు సంజయ్ చంద్ర, అజయ్ చంద్ర తీహార్ జైలుకు వచ్చారు. ఇళ్ల నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్న యూనిటెక్ సంస్థ తరపున వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసుకుని ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా మోసం చేశారన్న కేసులో జైలుపాలయ్యారు. 
తీహార్ జైలులో ప్రత్యేక సదుపాయాలు పొందుతూ వ్యాపార లావాదేవీలు యధావిధిగా కొనసాగిస్తున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేసి అభియోగాలు మోపింది. మాజీ ప్రమోటర్ సంజయ్ భార్య ప్రీతి చంద్ర, ఆయన తండ్రి రమేష్ చంద్రను ఈడీ అరెస్టు చేసి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు కేసు నమోదు చేసింది. ఈడి ఫిర్యాదుపై స్పందించిన సుప్రీంకోర్టు నిందితులను తీహార్ జైలు నుంచి ముంబయిలోని వేర్వేరు జైళ్లకు తరలించాలని ఆదేశాలిచ్చింది. యూనిటెక్ సంస్థ ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ సుమారు 50 వేల మందికిపైగా డిపాజిటర్ల నుంచి 724 కోట్లు వసూలు చేసి చేతులెత్తేసింది.