ట్రిబ్యునల్స్​ను ఉంచుతరా? తీసేస్తరా?

ట్రిబ్యునల్స్​ను ఉంచుతరా? తీసేస్తరా?
  • ట్రిబ్యునల్స్​లో ఖాళీలు భర్తీ చేయాల్సిందే
  • పదిరోజుల టైం ఇస్తున్నాం.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
  • ఇదిగో చేస్తాం.. అదిగో చేస్తాం.. అంటున్నారు కానీ చర్యల్లేవు
  • ట్రిబ్యునల్​ ఆర్డినెన్స్​ కొట్టేసినా మళ్లీ చట్టం ఎందుకు చేశారు?
  • అసలు ట్రిబ్యునల్స్​ను ఉంచుతరో.. తీసేస్తరో చెప్పాలంటూ సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: దేశంలోని ట్రిబ్యునల్స్​లో ఖాళీలను భర్తీ చేయకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెప్పుడు ఖాళీలను భర్తీ చేస్తారంటూ నిలదీసింది. 10 రోజుల్లోగా ట్రిబ్యునల్స్​లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. జీఎస్టీ అప్పిలేట్​ ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్​ను సోమవారం సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్​ సూర్య కాంత్​, జస్టిస్​ అనిరుద్ధ​ బోస్​ల ధర్మాసనం విచారణ జరిపింది. ఎలాంటి చర్చల్లేకుండానే ‘ట్రిబ్యునల్​ సంస్కరణల చట్టం 2021’ను పార్లమెంట్​లో పాస్​ చేయడంపై మండిపడింది. ట్రిబ్యునల్స్​ రీఫార్మ్స్​ (రేషనలైజేషన్​ అండ్​ కండిషన్స్​ ఆఫ్​ సర్వీస్​) ఆర్డినెన్స్​ 2021ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఆ చట్టం ఎలా చేస్తారంటూ ప్రభుత్వాన్ని సీజేఐ రమణ నిలదీశారు. ‘‘ఖాళీల భర్తీ గురించి 16 నెలలుగా అడుగుతున్నాం. ఎప్పుడు విచారణకు వచ్చినా ఇదిగో చేస్తున్నాం.. అదిగో చేస్తున్నాం.. అంటున్నారే తప్ప, చేస్తున్నట్టు మాత్రం మాకు ఎక్కడా కనిపించట్లేదు. ఇవన్నీ అర్థం లేని చర్యలు. మీకు చివరి అవకాశం ఇస్తున్నాం. పది రోజుల్లోగా నియామకాలు చేపట్టి చూపించండి’’ అని ఆయన తేల్చి చెప్పారు. 

ఎక్కడ చేశారు?
కోర్టులో ప్రభుత్వం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలను వినిపించారు. ఇప్పటికే ట్రిబ్యునల్స్​లో ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైందని, అది కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. దానికి స్పందించిన సీజేఐ రమణ.. ఎక్కడ జరుగుతున్నాయో చూపించండంటూ ఆయన్ను ప్రశ్నించారు. సెంట్రల్​ అడ్మినిస్ట్రేటివ్​ ట్రిబ్యునల్​(క్యాట్​)లో ఖాళీలను భర్తీ చేశారని వివరించారు. 

మేం కొట్టేస్తే.. కొట్టేయలేదంటరా?
ట్రిబ్యునల్​ ఆర్డినెన్స్​ను కోర్టు కొట్టేసినా.. కొట్టేయలేదంటూ పార్లమెంట్​లో ఎలా చెప్తారని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. మళ్లీ ఆ ఆర్డినెన్స్​ను ఎందుకు తీసుకొచ్చారో.. దానిని చట్టంగా ఎందుకు చేశారో కూడా సరైన కారణం చెప్పలేదన్నారు. పార్లమెంట్​ చట్టాలు చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ, సుప్రీంకోర్టు కొట్టేసిన ఒక ఆర్డినెన్స్​ను మళ్లీ చట్టంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్లమెంట్​లో మంత్రి చెప్పిన సమాధానాన్ని ఆయన చదివి వినిపించారు. ‘‘కోర్టు ఆర్డినెన్స్​ను కొట్టేయలేదు. కొన్నింటిపై అభ్యంతరం మాత్రమే లేవనెత్తింది. న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఎంత ముఖ్యమో.. పార్లమెంట్​కూడా చట్టాలు చేయడం అంతే ముఖ్యం. రాజ్యాంగబద్ధంగా, సామాన్య ప్రజల కోసమే పార్లమెంట్​లో చట్టాలను చేస్తున్నాం’’అని ఆనాడు పార్లమెంట్​లో మంత్రి చెప్పిన జవాబును సీజేఐ గుర్తు చేశారు.

ట్రిబ్యునల్స్​ను ఉంచుతరా? తీసేస్తరా?
పార్లమెంట్​లో ప్రతి బిల్లుపైనా సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీజేఐ ఎన్వీ రమణ ప్రభుత్వానికి సూచించారు. అలాంటప్పుడు చర్చల్లేకుండా ట్రిబ్యునల్​ బిల్లును పాస్​ చేయడమేంటని ప్రశ్నించారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. అసలు ట్రిబ్యునల్స్​ను కొనసాగిస్తరో లేదా.. తీసేస్తరో చెప్పాలని కేంద్రాన్ని నిలదీశారు. ఒక బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టడానికి ముందు దానికంటూ ఓ నోట్​ను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, అది చేశారా అని ప్రశ్నించారు. రెండు వారాల్లో ట్రిబ్యునల్స్​లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామంటున్నారని, ఆ హామీని తాము నమ్మొచ్చా అని జస్టిస్​ సూర్యకాంత్​ ప్రశ్నించారు. కాగా, అటార్నీ జనరల్​ ఆరోగ్యం బాగాలేదన్న విషయం తెలిసిందని, తర్వాతి విచారణకైనా ఆయన వస్తారా? అని ఎస్జీని సీజేఐ రమణ ప్రశ్నించారు. ఏజీతో మాట్లాడి చెప్తానని ఎస్జీ అన్నారు. దీంతో పదిరోజుల్లోగా ట్రిబ్యునల్స్​ ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా ఆదేశిస్తూ విచారణను కోర్టు వాయిదా వేసింది.