
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దగ్గు మందు (కాఫ్ సిరప్) మరణాలపై సీబీఐ విచారణ, మెడిసిన్ల భద్రతా విధానాల్లో సంస్కరణలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న విచారణలు సరిపోతాయని..ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న ఈ దశలో సీబీఐ జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో కాఫ్ సిరప్‌లు వాడటం వల్లే పిల్లలు మరణించారని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని సీనియర్ అడ్వకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ వేశారు. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన బెంచ్ శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తివారి వాదిస్తూ..మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో చిన్నారుల మరణాలకు కారణమైన కాఫ్ సిరప్‌లలో డైథిలీన్ గ్లైకాల్(డీఈజీ), ఎథిలీన్ గ్లైకాల్(ఈజీ) అనే విషపూరిత పదార్థాలున్నాయని కోర్టుకు తెలిపారు.
ఈ ఘటనపై సీబీఐ విచారణ అవసరమని వాదించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ "పిటిషనర్ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు చూసి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. చిన్నారుల మృతిపై రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. సీబీఐ జోక్యం అవసరం లేదు" అని చెప్పారు.