మన ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చొద్దు

మన ఎన్నికల ప్రక్రియను  విదేశాలతో పోల్చొద్దు
  • ఈవీఎంలపై విచారణ సందర్భంగా  సుప్రీంకోర్టు కామెంట్

న్యూఢిల్లీ: మన ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చి చూడొద్దని.. అక్కడి జనాభాకు, మన జనాభాకు చాలా తేడా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల వ్యవస్థను కించపర్చొద్దని కోరింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను క్రాస్ చెక్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ తరఫున లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ‘‘ఈవీఎంలు, వీవీప్యాట్ లను మార్చే అవకాశం ఉంది. చాలా దేశాలు ఈవీఎంల నుంచి మళ్లీ బ్యాలెట్ పేపర్ కు మారాయి.

 మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. లేదంటే వీవీప్యాట్ స్లిప్పులను ఓటర్లకు అందజేయాలి. అలా కుదరదంటే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్పును ఓటర్ పరిశీలించుకుని బ్యాలెట్ బాక్స్ లో వేసే అవకాశం కల్పించాలి” అని అన్నారు. ఈ సందర్భంగా జర్మనీ ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ విధానానికి మారిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో స్పందించిన బెంచ్.. జర్మనీ జనాభా ఎంత అని ప్రశ్నించింది. దానికి 6 కోట్లు అని భూషణ్ జవాబిచ్చారు. ‘‘మన దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మీరు అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతున్నారు.

 మేం 60 పదుల వయసులో ఉన్నాం. గతంలో బ్యాలెట్ పేపర్ల విధానం ఉన్నప్పుడు ఏం జరిగిందో మాకు తెలుసు. మీరు మరిచిపోయి ఉండొచ్చు. కానీ మేం మరిచిపోలేదు” అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈవీఎంలను ప్రజలు నమ్మడం లేదని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? అని బెంచ్ ప్రశ్నించగా.. ఓ సర్వే విషయాలను ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. అయితే.. ‘‘మేం అలాంటి సర్వేలను నమ్మం. డేటాను నమ్ముతాం” అని బెంచ్ పేర్కొంది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.