కోర్టుల వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఒక స్వతంత్ర వేదిక ఉంటే బాగుంటుందని యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. భావితరాల కోసం కోర్టుల ప్రొసీడింగ్స్ ను నిక్షిప్తం చేసే ఉద్దేశంతో ఈ దిశగా ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదే అంశంపై సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ దాఖలు చేసిన ఓ అభ్యర్ధనపై వాదనలు వినే సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“చాలా హైకోర్టులు కోర్టు వ్యవహారాలను యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఈ లైవ్ స్ట్రీమింగ్స్ చేసేందుకు ఒక ప్రత్యేక వేదిక ఉంటే బాగుంటుందని మేం యోచిస్తున్నం. ఇందుకోసం సంస్థాగతమైన ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది. కరోనా సంక్షోభ సమయంలో కోర్టు వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారాలను తాత్కాలిక ప్రాతిపదికన నిర్వహించాం. ఇప్పుడు మనం ఈ ప్రత్యక్ష ప్రసారాలను భవిష్యత్ తరాలకు చేరవేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్నం. మనది చాలా పెద్ద దేశం. దేశంలోని వైవిధ్యం, విస్తృత ప్రయోజనాలు నెరవేర్చేలా వ్యవస్థాగత మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది”అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేసే ఒక వేదికను సిద్ధం చేయగల ఏజెన్సీని ఎంపిక చేసేందుకు సంబంధించి సుప్రీంకోర్టుకు చెందిన ‘ఈ– కమిటీ’ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను ఆహ్వానించాలని భావిస్తోందన్నారు. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి చెందిన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
