అభ్యర్థుల నేరచరిత్రను 48 గంటల్లో తెలియజేయాలి

అభ్యర్థుల నేరచరిత్రను 48 గంటల్లో తెలియజేయాలి

క్రిమినల్ పాలిటిక్స్ ను కంట్రోల్ చేసే క్రమంలో భాగంగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల క్రిమినల్ రికార్డ్ ను పార్టీలు 48 గంటల్లోగా ప్రచురించాలని ఆదేశించింది. జస్టిస్ నారిమన్, BR గవైలతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల నేరచరిత్ర, పెండింగ్ కేసుల సమగ్రవివరాలను పార్టీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలంది. నేరచరిత్ర ఉన్న అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేశారో కూడా ప్రస్తావించాలని తెలిపింది. 2020 ఫిబ్రవరి 13నాటి తీర్పులో మార్పులు చేసింది సుప్రీంకోర్టు. 2020 నవంబర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నేరచరిత్ర వివరాలు ప్రచురించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు పిటిషనర్లు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను హైకోర్టుల అనుమతి లేకుండా ఉపసంహరించేందుకు వీళ్లేదని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. 2020 సెప్టెంబర్ 16 తర్వాత నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను ఉపసంహరించిన వివరాలను తెలియజేయాలని హైకోర్టులను సూచించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారణ జరుపుతున్న, జరిపిన న్యాయమూర్తుల జాబితాను కూడా అందించాలని అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్ ను ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల స్టేటర్ రిపోర్టు సుప్రీంకోర్టుకు అందించేందుకు రెండు వారాల గడువు కోరింది కేంద్రం. దీంతో కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు చీఫ్ జస్టీస్ ఎన్వీరమణ. స్టేటస్  రిపోర్టు అందించేందుకు అంత సమయం ఎందుకని ప్రశ్నించారు.  కేంద్రం తీరు సరిగా లేదన్నారు. రెండు వారాలు గడువిస్తున్నాం. ఇదే చివరి అవకాశం.... గడువు పొడిగించడం ఇకపై కుదరదన్నారు.