నీట్ పై సీబీఐ విచారణకు సుప్రీం నో

నీట్ పై సీబీఐ విచారణకు సుప్రీం నో
  • కౌన్సిలింగ్ ఆపేందుకు నిరాకరణ
  • నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీకి నోటీసులు
  • విచారణ వచ్చే నెల 8కి వాయిదా

న్యూఢిల్లీ: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​ ఎగ్జాం వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీకి నో చెప్పింది. అలాగే, నీట్​ –2024 కౌన్సిలింగ్​ను నిలిపివేయడానికి నిరాకరించింది. ఈ వ్యవహారంపై దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్​ విక్రమ్​ నాథ్​, జస్టిస్​ సందీప్​ మెహతాతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. 

నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ)కి నోటీసులు జారీచేసింది. దీనిపై రెండు వారాల్లోగావివరణ ఇవ్వాలని ఏజెన్సీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. 

రేపు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్​ పిలుపు

నీట్​ అవకతవకలపై నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా  ఆందోళన చేయాలని కాంగ్రెస్​ బుధవారం పిలుపునిచ్చింది. స్టూడెంట్స్​కు న్యాయం జరగాలనే డిమాండ్​తో రాష్ట్ర హెడ్​క్వార్టర్స్​లో నిరసన చేపట్టాలని పార్టీ స్టేట్​యూనిట్స్​కు సూచించింది. 

ప్రియాంక గాంధీపై చర్యకు బీజేపీ డిమాండ్​

నీట్​ ఎగ్జామ్​పై తప్పుడు ఆరోపణలు చేసిన స్టూడెంట్​ వీడియో షేర్​ చేసినందుకు కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ ప్రియాంక గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్​ చేసింది. తన ఓఎంఆర్​ చినిగిపోయిందని, తనకు తక్కువ మార్కులు వేశారంటూ ఆయుశీ పటేల్​అనే స్టూడెంట్​ కోర్టులో కూడా ఫేక్​ డాక్యుమెంట్స్​ సమర్పించిందని,  తప్పుడు ఆరోపణలు చేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్​ పూనావాల పేర్కొన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కోర్టే వెల్లడించిందని అన్నారు. ఆయుశీ వీడియోను షేర్​ చేసినందుకు ప్రియాంకగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.