నంబి నారాయణన్ కేసు : నలుగురికి ముందస్తు బెయిల్​పై మళ్లీ విచారించండి

నంబి నారాయణన్ కేసు : నలుగురికి ముందస్తు బెయిల్​పై మళ్లీ విచారించండి

న్యూఢిల్లీ: 1994 నాటి ఇస్రో మాజీ సైంటిస్ట్​ నంబి నారాయణన్​ గూఢచర్యం కేసులో మాజీ డీజీపీ సహా నలుగురికి ముందస్తు బెయిల్​ ఇస్తూ కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ అంశాన్ని తిరిగి హైకోర్టుకే అప్పగిస్తూ.. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్​ ఎంఆర్​షా, జస్టిస్​ సీటీ రవికుమార్​తో కూడిన బెంచ్​ ఆదేశాలు జారీ చేసింది. ఇస్రో మాజీ సైంటిస్ట్​ నంబి నారాయణన్​ను ఇరికించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై సీబీఐ విచారిస్తున్న కేసులో గుజరాత్‌‌‌‌ మాజీ డీజీపీ ఆర్​బీ శ్రీకుమార్‌‌‌‌, కేరళకు చెందిన రిటైర్డ్​ పోలీసు అధికారులు ఎస్ విజయన్, థంపీ ఎస్​ దుర్గాదత్, రిటైర్డ్​ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్​ పీఎస్​ జయప్రకాశ్​ కు 2021 ఆగస్టులో కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌‌‌‌ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శ్రీకుమార్​ అప్పట్లో ఇంటెలిజెన్స్​ బ్యూరో(ఐబీ) డిప్యూటీ డైరెక్టర్​గా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు బెంచ్.. ‘‘ముందస్తు బెయిల్ మంజూరు చేసే హైకోర్టు ఆర్డర్‌‌‌‌లను రద్దు చేస్తున్నాం. అన్ని విషయాలు తిరిగి హైకోర్టుకు పంపుతాం. మెరిట్‌‌‌‌ ఆధారంగా తాజా నిర్ణయం తీసుకోవాలి. ఇరు పక్షాలకు సంబంధించి మేము ఎలాంటి మెరిట్‌‌‌‌ను గమనించలేదు. అంతిమంగా ఉత్తర్వులు జారీ చేయడం హైకోర్టుకు సంబంధించినది. ముందస్తు బెయిల్ దరఖాస్తులపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచిస్తున్నాం” అని పేర్కొంది. వారంలోగా సంబంధిత బెంచ్​ ముందుకు బెయిల్ దరఖాస్తులను తీసుకురావాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. బెయిల్ దరఖాస్తులపై హైకోర్టు తేల్చేవరకు ఐదు వారాల వరకు ప్రతివాదులను అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది.

1994 నాటి కేసు..

ఇండియన్​ స్పేస్​ ప్రోగ్రామ్​కు సంబంధించిన కీలక రహస్యాలను విదేశాలకు చేరవేశారనే ఆరోపణలపై 1994లో నంబి నారాయణన్​ను కేరళ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇద్దరు సైంటిస్టులు, ఇద్దరు మాల్దీవులకు చెందిన మహిళలతో పాటు మరో ఇద్దరికి ఇందులో సంబంధం ఉందని ఆరోపించారు. అయితే సీబీఐ నారాయణన్​కు క్లీన్​చిట్​ ఇచ్చింది. కేరళ పోలీసులు కుట్రపూరితంగా ఆయనను ఇరికించారని ఆరోపించింది. ఈ కేసు నమోదు చేసే నాటికి అసలు అటువంటి టెక్నాలజీనే లేదని పేర్కొంది. నారాయణన్​ అక్రమ అరెస్ట్​కు అప్పటి టాప్​ పోలీసు అధికారులే కారణమని ఆరోపించింది. కేసు దర్యాప్తు సందర్భంగా కొందరు సైంటిస్టులను పోలీసులు టార్చర్​ పెట్టారని, కొందరిని కుట్రపూరితంగా గూఢచర్యం కేసుల్లో ఇరికించారని సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ కేసు కారణంగా క్రయోజెనిక్​ ఇంజిన్​ డెవలప్​మెంట్​లో మనదేశం స్పేస్​ ప్రోగ్రాంలో ఒకటి, రెండు దశాబ్దాలు వెనకబడిందని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి 18 మందిపై నేరపూరిత కుట్ర సహా వివిధ సెక్షన్ల కింద సీబీఐ 
అభియోగాలు నమోదు చేసింది.

జడ్జిల నియామక వ్యవస్థ దారి తప్పొద్దు

కొలీజియం అత్యంత పారదర్శకంగా పని చేస్తున్నదని సుప్రీంకోర్టు చెప్పింది. జడ్జిల నియామక వ్యవస్థ దారి తప్పకూడదని కామెంట్ చేసింది. ‘‘పని చేస్తున్న వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు. కొలీజియంను తన పని తాను చేసుకోనివ్వండి. మాది అత్యంత పారదర్శక వ్యవస్థ. నిర్ణయాలపై కామెంట్లు చేయడం కొలీజియం మాజీ సభ్యులకు ఫ్యాషన్ అయిపోయింది” అని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్‌‌‌‌ సీటీ రవి కుమార్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్ చెప్పింది. 2018లో జరిగిన వివాదాస్పద సుప్రీంకోర్టు కొలీజియం మీటింగ్‌‌‌‌ వివరాలను ఆర్టీఐ కింద ఇవ్వాలని యాక్టివిస్ట్ అంజలి భరద్వాజ్ వేసిన పిటిషన్‌‌‌‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్‌‌‌‌‌‌‌‌ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. దీనిపై జస్టిస్ షా స్పందిస్తూ.. నాటి కొలీజియం మీటింగ్‌‌‌‌లో ఎలాంటి తీర్మానం పాస్ చేయలేదు. మాజీ సభ్యులు తీసుకున్న చర్యలపై స్పందించాలని మేం అనుకోవట్లేదు’ అన్నారు. తమది పారదర్శకమైన సంస్థ అని, తాము వెనక్కి తగ్గడంలేదని.. చాలా మౌఖిక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.పిటిషన్‌‌‌‌పై తమ నిర్ణయాన్ని 
రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.