
- మేజర్ అయ్యాక దోషిని పెండ్లి చేసుకున్న బాధితురాలు
- ప్రస్తుతం ఆమె భర్త, బిడ్డతో సంతోషంగా ఉన్నట్టు కమిటీ నివేదిక
- ప్రత్యేక కేసుగా పరిగణించి శిక్షించకుండా వదిలేసిన సుప్రీం బెంచ్
న్యూఢిల్లీ: మైనర్ అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి పోక్సో చట్టం కింద దోషిగా తేలినప్పటికీ, అతడికి ఎలాంటి శిక్షను విధించకుండా విడిచిపెడుతున్నట్టు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2023 నాటి ఈ కేసులో బాధితురాలు మేజర్ అయిన తర్వాత దోషిని పెండ్లి చేసుకుని, ఓ బిడ్డను కని సంతోషంగా ఉందని.. అందువల్ల దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి దోషిని శిక్ష లేకుండా వదిలేయాలని ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కూడిన బెంచ్ నిర్ణయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించి, ఈ తీర్పును ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మైనర్ అమ్మాయితో లైంగిక చర్యల్లో పాల్గొన్న 24 ఏండ్ల యువకుడికి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద ట్రయల్ కోర్టు విధించిన 20 ఏండ్ల జైలు శిక్షను కలకత్తా హైకోర్టు 2023లో రద్దు చేసింది. అతడిని నిర్దోషిగా విడిచిపెట్టింది. ‘‘టీనేజ్ అమ్మాయిలు లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి” అంటూ ఆ తీర్పు సందర్భంగా హైకోర్టు జడ్జి చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు 2024లో కలకత్తా హైకోర్టు తీర్పును రద్దు చేసింది. బాధితురాలి ప్రస్తుత పరిస్థితులను, మానసిక శ్రేయస్సును పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ ఒక క్లినికల్ సైకాలజిస్ట్, ఒక సోషల్ సైంటిస్ట్ తో పాటు మరికొందరు నిపుణులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. కమిటీ గత నెలలో ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజాగా తుది తీర్పును వెలువరించింది.
ఇది ప్రతి ఒక్కరి కళ్లను తెరిపించే కేసు..
ఈ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ స్పందిస్తూ.. ‘‘సమాజం ఆమె గురించి తీర్పు ఇచ్చింది. ఆమెను న్యాయ వ్యవస్థ ఫెయిల్ చేసింది. సొంత కుటుంబమే ఆమెను దూరం పెట్టింది” అని కామెంట్ చేసింది. ‘‘బాధితురాలు ప్రస్తుతం మేజర్. ఆ సంఘటనను ఆమె ఇప్పుడు నేరంగా చూడటం లేదు. చట్ట ప్రకారం దోషి చేసింది నేరమే అయినా.. దానిని నేరంగా బాధితురాలు భావించడంలేదు. ఈ నేరం వల్ల ఆమె మానసికంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేదు. కానీ ఆ తర్వాత.. పోలీసులు, న్యాయ వ్యవస్థ రూపంలోనే అనేక పరిణామాలను ఎదుర్కొన్నది. నిందితుడికి శిక్ష పడకుండా కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ కేసులోని నిజాలు ప్రతి ఒక్కరి కండ్లను తెరిపించేలా ఉన్నాయి. ప్రస్తుతం బాధితురాలు దోషితో కలిసి సంతోషంగా కుటుంబ జీవితం కొనసాగిస్తోంది. అందుకే ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాలను వినియోగించి, ఆమెకు ‘పూర్తి న్యాయం’ చేస్తున్నాం” అని సుప్రీం బెంచ్ పేర్కొంది.