- లాయర్ ఆఫీస్‌లో జీఎస్టీ సోదాలు, డేటా క్లోనింగ్‌కు స్టే
- సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ: లాయర్ ఆఫీసులో సోదాలకు జీఎస్టీ అధికారులకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఒక నేరంలో న్యాయవాది వ్యక్తిగత ప్రమేయాన్ని సూచించే ప్రాథమిక మెటీరియల్ ఉంటే చట్ట అమలు సంస్థలు లాయర్ కార్యాలయాన్ని తనిఖీ చేయవచ్చని స్పష్టంచేసింది. ఈమేరకు న్యాయవాది పునీత్ బాత్రా దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా.. దర్యాప్తు సంస్థలు ఏకపక్షంగా, సీజ్ చేసిన మెటీరియల్‌లో ఏది గోప్యమైనది (అడ్వకేట్- క్లయింట్ ప్రివిలేజ్), ఏది కాదనేది ఎలా నిర్ణయిస్తాయని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘మీరు సాక్ష్యాలను సేకరించడంపై ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే, అందులో గోప్యంగా ఉంచాల్సిన, ప్రివిలేజ్డ్ మెటీరియల్ ని మీరు ఏవిధంగా వేరు చేస్తారు? అని ప్రశ్నించింది.
జీఎస్టీ అధికారుల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. మార్ట్ కర్మ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంటీపీఎల్) అనే గేమింగ్ కంపెనీపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాత్రా కేవలం న్యాయ సలహాదారుగా సంస్థకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, దాని వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడంలో చురుగ్గా పాల్గొంటున్నారని ఆరోపించారు.
దర్యాప్తు సమయంలో రహస్య విషయాలను సవరించి వేరు చేయవచ్చని పేర్కొన్నారు. అయితే, ధర్మాసనం ఈ విధానాన్ని తిరస్కరించింది. సోదాలు, డేటా క్లోనింగ్‌కు సంబంధించిన హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది. ఈ చట్టబద్ధత అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, జీఎస్టీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో పిటిషనర్ బుధవారం అధికారుల ఎదుట విచారణకు హాజరుకావచ్చని పేర్కొంది.
