
న్యూఢిల్లీ: ‘అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ నెలల తరబడి పెండింగ్లో పెట్టడం కరెక్టేనా..?’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘‘బిల్లుల గడువు 6 వారాలు ఉండేది. దాన్ని ‘సాధ్యమైనంత త్వరగా’ అని మార్చారు. ఓ సభ్యుడు దీన్ని ‘తక్షణమే’ అని అర్థం చేసుకోవాలని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం ఇదే అయితే.. మనం దాన్ని విస్మరించవచ్చా?”అని కేంద్రాన్ని అడిగారు. గవర్నర్లు అంతులేని ఆలస్యం చేస్తుంటే ‘సాధ్యమైనంత త్వరగా’అనే పదానికి అర్థమే లేకుండాపోతున్నదని తెలిపారు.
బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు నెలల పాటు పెండింగ్లో ఉంచడంపై తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం గురువారం విచారించింది. ఆర్టికల్ 200 ప్రకారం తన వద్దకు వచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించడమో.. తిరస్కరించడమో లేకపోతే పున:పరిశీలనకు అసెంబ్లీకి పంపడమో చేయాలని సీజేఐ అన్నారు. ఫైనాన్స్ బిల్లులనూ గవర్నర్ తిరస్కరిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. బిల్లులు తొక్కిపెడ్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. ఎందుకంటే రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఫండమెంటల్ రైట్స్ అంటూ ఏమీ లేవన్నారు. ‘ఆర్టికల్ 361 అనేది రాష్ట్రపతి, గవర్నర్ల విధులు, అధికారాలను తెలియజేస్తుంది. వాళ్లు నిర్వర్తించే విధులకు చట్టపరమైన చర్యల నుంచి రక్షణ ఉంటుంది. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం కోర్టులకు ఉండదు. అలాగే.. బిల్లులు, ఇతర అంశాలపై తీసుకునే నిర్ణయాల విషయంలోనూ వాళ్లు కోర్టులో సమాధానం చెప్పాల్సిన అవసరం లేని పేర్కొన్నారు.