
- మంచి ప్రణాళికతో రండి..అభినందిస్తం
- నా రిటైర్మెంట్లోపు సమర్పించండి
- కంచ గచ్చిబౌలి కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ గవాయ్ సూచన
- సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కోసం ప్రయత్నం బాగుంది
- మంచి ప్రతిపాదనతో వస్తే.. అన్ని ఆంక్షలు ఎత్తేస్తం
- కావాల్సింది పర్యావరణ పరిరక్షణ అని వెల్లడి
- ప్రణాళిక సమర్పణకు 6 నుంచి 8 వారాల టైమ్ కోరిన ప్రభుత్వం
న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి ప్రాంతానికి సంబంధించి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించే పనిలో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు న్యాయస్థానం అభినందించింది. మంచి ప్రణాళికతో వస్తే.. ప్రశంసలు ఇస్తామని, అన్ని ఆంక్షలు ఎత్తేస్తామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతో పాటు బీ ఫర్ ది చేంజ్ సొసైటీ, ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లపై బుధవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్నేతృత్వంలోని జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
“ప్రస్తుతం ఆ స్థలంలో అన్ని పనులు ఆగిపోయాయి. దీనిపై ఏ ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు మేం అడవులు, చెరువులు మొదలైన వాటిని కాపాడే విస్తృత ప్రణాళికను రూపొందిస్తున్నం” అని సుప్రీంకోర్టుకు వివరించారు. ఇందుకు కోసం కొంత సమయం పడుతుందన్నారు. ప్రణాళికలను రికార్డు రూపంలో అందించడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం కావాలని కోరారు. ఈ అభ్యర్థనపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ... మంచి ప్రతిపాదనతో రావాలని సూచించారు.
“మీరు మంచి ప్రతిపాదన తీసుకొస్తే.. మేం అన్నింటినీ (రాష్ట్రంపై సుమోటోగా చర్యలు) ఉపసంహరించుకుంటం. అన్ని ఆంక్షలు ఎత్తేసి నిజమైన ప్రశంస ఇస్తం. మాకు కావాల్సింది పర్యావరణ పరిరక్షణ” అని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అటవీని పునరుద్ధరించాలన్నారు. అయితే.. తన రిటైర్మెంట్లోపు ఈ ప్రణాళికను సమర్పించాలని ఆయన ఆదేశించారు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.