‘ప్రజాప్రతినిధుల’ కేసుల దర్యాప్తులో  లేటెందుకు?

‘ప్రజాప్రతినిధుల’ కేసుల దర్యాప్తులో  లేటెందుకు?

10-15 ఏళ్లుగా చార్జ్‌‌‌‌షీట్లు దాఖలు చేయలేదేం?: సుప్రీంకోర్టు
 ఆస్తులను అటాచ్ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు
 తప్పుడు కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు విత్ డ్రా చేసుకోవచ్చు
 ఆయా కేసులను హైకోర్టులు ఎగ్జామిన్ చేయాల్సిందే

న్యూఢిల్లీ:ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఎన్​ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ నమోదు చేసిన కేసుల దర్యాప్తు, విచారణను పూర్తిచేయడంలో జాప్యం జరగడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ‘‘దాదాపు 200 కేసులు కోర్టుల్లో పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. మిస్టర్ తుషార్ మెహతా.. ఇలా చెప్పడానికి మేం చింతిస్తున్నాం. ఈ రిపోర్టులు అసంపూర్తిగా ఉన్నాయి. 10 నుంచి 15 ఏళ్లుగా చార్జ్‌‌‌‌షీట్లు దాఖలు చేయలేదు. చార్జ్‌‌‌‌షీట్లు దాఖలు చేయకపోవడానికి కారణాలేంటనేది కూడా చెప్పలేదు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు” అని పేర్కొంది. ‘‘ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపై మేం ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలేదు. అలా చేస్తే వాటి నైతికతను తగ్గించినట్లు అవుతుంది” అని అభిప్రాయపడింది. దర్యాప్తు సంస్థలకు మ్యాన్‌‌‌‌పవర్, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను ప్రొవైడ్ చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ అంశంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జడ్జిలు జస్టిస్ డీవీ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌‌‌‌తో కూడిన బెంచ్ చెప్పింది. తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో దోషులైన చట్టసభ్యులపై జీవితకాల నిషేధం విధించాలని, చట్టసభ్యులపై ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌‌‌‌పై సుప్రీంకోర్టు విచారించింది. 
సమస్యలున్నయ్..
ఈ కేసులో అమికస్ క్యూరీగా నియమితులైన సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విషయంలో సీబీఐ, ఈడీ రూపొందించిన స్టేటస్ రిపోర్టులు ఆశ్చర్యకరంగా ఉన్నాయని, విచారణ వేగవంతం చేయడానికి సర్జికల్ ట్రీట్‌‌‌‌మెంట్ అవసరమని చెప్పారు. స్పందించిన బెంచ్.. ‘‘ఈడీ, సీబీఐ నివేదికలను కోర్టు పరిశీలించింది. విచారణను వేగవంతం చేయాలని చెప్పడం చాలా సులభం. కానీ ఇందులో అనేక సమస్యలు ఉన్నాయని మాకు తెలుసు. జడ్జిలు, కోర్టులు, మౌలిక సదుపాయాల కొరత ఉంది. 2012 నుంచి 76 ఈడీ కేసులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న 58 కేసులు సీబీఐ వద్ద పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి’’ అని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఈ అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఇప్పటికే తమ అసంతృప్తిని తెలియజేశామని, ఏదో ఒకటి చేయాలని సూచించామని బెంచ్ తెలిపింది. ఈ సమయంలో స్పందించిన హన్సారియా.. రాజకీయ కారణాలతో, ద్వేషంతో కొందరిపై కేసులు పెడుతున్నారని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు విత్ డ్రా చేసుకుంటున్నాయని చెప్పారు. జోక్యం చేసుకున్న బెంచ్.. ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు విత్ డ్రా చేసుకోవడాన్ని మేం వ్యతిరేకించడం లేదు. కావాలని ఇరికించేందుకు కేసులు పెట్టి ఉంటే.. విత్ డ్రా చేసుకునే పవర్ వాటికి ఉంది. అయితే అంతకుముందే హైకోర్టు లేదా జ్యుడీషియల్ ఆఫీసర్ ఎగ్జామిన్ చేయాలి. ఇందుకోసం ప్రభుత్వాలు హైకోర్టులకు వెళ్లాలి. మేం ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తాం’’ అని చెప్పింది. 
అందరూ సీబీఐ దర్యాప్తు కావాలంటున్నరు

‘‘న్యాయవ్యవస్థ లాగే దర్యాప్తు సంస్థలు కూడా మ్యాన్‌‌‌‌పవర్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయంలో ప్రాక్టికల్‌‌‌‌గా ఆలోచించాలి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు” అని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ‘‘సిట్టింగ్ లేదా మాజీ చట్టసభ్యుడిని దోషిగా నిర్ధారించిన తర్వాత.. సదరు వ్యక్తి అప్పీల్‌‌‌‌ను హైకోర్టులో ప్రాధాన్యతపై కాకుండా సాధారణ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌ ప్రకారమే విచారించాలని కూడా మేమిచ్చే ఆదేశాల్లో స్పష్టం చేస్తాం’’ అని చెప్పారు. 51 మంది సిట్టింగ్‌‌‌‌లు, మాజీ ఎంపీలతో సహా 120 మందికి పైగా ప్రజాప్రతినిధులు మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ఈడీ విచారణ జరిపింది. 121 మందిపై వివిధ క్రిమినల్ నేరాలకు సంబంధించి సీబీఐ కేసులు నమోదు చేసింది.