నీట్​పై ఎన్టీఏకు సుప్రీం నోటీసులు

నీట్​పై ఎన్టీఏకు సుప్రీం నోటీసులు
  • ఎగ్జామ్ రద్దు పిటిషన్​పై వివరణ కోరిన బెంచ్ 
  • పరీక్ష రద్దు అంత సులభం కాదని కామెంట్ 
  • కౌన్సెలింగ్​పై స్టే విధించేందుకు నిరాకరణ 
  • అడ్మిషన్లు ఆపాలని పట్టుబడితే  పిటిషన్ కొట్టివేస్తామన్న కోర్టు 

న్యూఢిల్లీ: నీట్ పరీక్షను రద్దు చేయడం అంత సులభం కాదని, అలా చేస్తే ఆ పరీక్షకు ఉన్న పవిత్రత దెబ్బతింటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీట్–యూజీ ఎగ్జామ్ లో అక్రమాలు జరిగాయని, పేపర్ లీక్ అయిందని.. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ను రద్దు చేసి, మళ్లీ కొత్తగా నిర్వహించాలని 10 మంది స్టూడెంట్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. 

‘‘నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయడం అంత సులభం కాదు. అలా చేస్తే ఆ పరీక్షకు ఉన్న పవిత్రత దెబ్బతింటుంది. అందువల్ల ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి” అని బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి నోటీసులు జారీ చేసింది. అలాగే బిహార్​లోని ఓ ఎగ్జామ్ సెంటర్ లో మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో బిహార్ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది. 

ఈ క్రమంలో అప్పటివరకు నీట్ కౌన్సెలింగ్ పై స్టే విధించాలని విద్యార్థుల తరఫు లాయర్ మాథ్యూస్ జె నెడుంపర కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. ‘‘మేం కౌన్సెలింగ్​ను ఆపం. అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మీరు దీనిపై పట్టుబడితే పిటిషన్ ను కొట్టివేస్తం” అని హెచ్చరించింది. నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ఇప్పటికే ఒక పిటిషన్ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద పెండింగ్ లో ఉందని, దీన్ని కూడా దానితో జత చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. 

నీట్–పీజీ పిటిషన్ కొట్టివేత.. 

నీట్–పీజీ 2022 ఎగ్జామ్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తమకు తక్కువ మార్కులు వచ్చాయని, అయితే రీవాల్యుయేషన్ కు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్ బీఏ) అనుమతివ్వడం లేదని కొందరు విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై  జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ‘‘ఈ పిటిషన్ నిరుపయోగంగా మారింది. ఇక దీన్ని పెండింగ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. అందుకే కొట్టివేస్తున్నాం’’ అని బెంచ్ మంగళవారం వెల్లడించింది.