Diya Suriya: తెరవెనుక మహిళల కథ 'లీడింగ్ లైట్'.. ఆస్కార్ రేసులో సూర్య కుమార్తె దియా తొలి సినిమా!

Diya Suriya: తెరవెనుక మహిళల కథ 'లీడింగ్ లైట్'..  ఆస్కార్ రేసులో సూర్య కుమార్తె దియా తొలి సినిమా!

తమిళ సినీ ప్రపంచంలో ప్రముఖ నటీనటులైన సూర్య, జ్యోతికల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ..  వారి కుమార్తె దియా సూర్య మెగాఫోన్ పట్టింది. యువ దర్శకురాలిగా  తొలి అడుగు వేసింది. దియా రూపొందించిన మొట్టమొదటి చిత్రం, డాక్యు-డ్రామా షార్ట్ ఫిల్మ్ 'లీడింగ్ లైట్' (Leading Light). ఈ వినూత్న చిత్రాన్ని వారి కుటుంబ బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. 

తెరవెనుక మహిళల కష్టాలను చూపిన దియా

'లీడింగ్ లైట్' డాక్యుమెంటరీ ,  డ్రామా అంశాల మేళవింపుతో, బాలీవుడ్‌లో లైటింగ్ పరికరాలతో పనిచేసే మహిళా గాఫర్స్ జీవితాలను తెరపైకి తీసుకొచ్చింది.  చిత్ర నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగంలో ఉన్నప్పటికీ, తరచుగా గుర్తించబడని ఈ మహిళా సిబ్బంది పోరాటాలు, వృత్తిపరమైన సవాళ్లు, విజయాలను ఈ చిత్రం ఎత్తి చూపింది. తెరవెనుక కష్టపడే కార్మికుల కథలకు ఒక బలమైన వేదికను కల్పించాలనే లక్ష్యంతో దియా ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకుంది. తన మొదటి ప్రయత్నంలోనే సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశాన్ని  దియా ఎంచుకుంది.

ఆస్కార్‌ వైపు తొలి అడుగు!

దియా సూర్య కెరీర్‌కు ఈ చిత్రం అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న రీజెన్సీ థియేటర్‌లో ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్ కోసం ప్రదర్శితమవుతోంది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతి రోజూ ఈ ప్రదర్శన జరగనుంది. దియా కొత్త ఆలోచన, బలమైన కథనానికి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

Also Read : నానిని ఢీకొట్టే 'శికంజా మాలిక్'

 "దియా సూర్య దర్శకత్వంలో 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై 'లీడింగ్ లైట్' చిత్రాన్ని అందించడం మాకు సంతోషంగా ఉందని సూర్య, జ్యోతిక దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.  బాలీవుడ్ మహిళా గాఫర్స్‌ జీవితాలపై వెలుగు ప్రసరింపజేస్తున్న ఈ డాక్యు-డ్రామాకు మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణమని తెలిపారు. ప్రముఖ నటీనటుల కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన దియా, యాక్టింగ్‌ను కాకుండా డైరెక్షన్ ఎంచుకోవడం, అది కూడా బలమైన కథాంశంతో రావడంతో ఆమె భవిష్యత్తు సినీ ప్రయాణంపై సినీ వర్గాలలో ఆసక్తి పెరిగింది.