
నేచురల్ స్టార్ నాని హీరోగా, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ నుంచి అభిమానులను ఉర్రూతలూగించే పవర్ ప్యాక్డ్ అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ బాబు భాగమవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో మోహన్ బాబు 'శికంజా మాలిక్' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తుండడం మరింత ఆసక్తిని పెంచింది
'శికంజా మాలిక్'గా దిగ్గజ విలనిజం రీలోడ్
మోహన్‌బాబు ఈ చిత్రంలో ఒక ఏరియాకు డాన్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో షర్ట్ లేకుండా, చేతిలో పెద్ద కత్తి, గన్ పట్టుకుని, స్టైలిష్ సిగార్ కాలుస్తూ, రగ్గడ్ లుక్‌లో గంభీరంగా కనిపిస్తున్నారు. ఆయన చేతికి అంటిన రక్తం మరకలు, ఆవేశభరితమైన చూపు ఆయన పాత్ర యొక్క క్రూరత్వాన్ని సూచిస్తున్నాయి. చిత్ర బృందం ఆయన లుక్‌ను విడుదల చేస్తూ, "ది డార్క్ లార్డ్ ఆఫ్ సినిమా మళ్లీ ఉదయిస్తున్నాడు. లెజెండరీ మోహన్ బాబు గారు 'శికంజా మాలిక్'గా పీక్ విలనిజాన్ని తిరిగి చూపించబోతున్నారు" అని పేర్కొంది. దీంతో ఈ పాత్ర పవర్ ఏ స్థాయిలో ఉండబోతుందో అన్న అసక్తిని రెట్టింపు చేసింది.
కొద్ది రోజుల క్రితమే, మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆమె చెప్పినట్లే.. ఈ పాత్ర కోసం మోహన్‌బాబు ప్రత్యేకంగా శారీరకంగా కష్టపడి, కొత్త లుక్‌లోకి మారారు. ఈ ప్రత్యేకమైన పాత్రతో ఆయన విలనిజాన్ని మరోస్థాయికి తీసుకెళ్లడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో సినిమాల్లో సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన మోహన్‌బాబు, ఇప్పుడు ఈ 'శికంజా మాలిక్' పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఖాయమని చిత్రబృందం నమ్ముతోంది.
ALSO READ : కొత్త లవ్‌తో కమిట్‌మెంట్..
నాని వర్సెస్ మోహన్ బాబు
ఈ చిత్రంలో హీరో నాని కూడా గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్, రా అండ్ ఇంటెన్స్ లుక్‌లో ‘జడల్’ (Jadal) పాత్రలో కనిపించనున్నారు. 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానిని మరోసారి అత్యంత శక్తివంతమైన పాత్రలో చూపించబోతున్నారు. నాని 'జడల్' పాత్రకు, మోహన్‌బాబు 'శికంజా మాలిక్' పాత్రకు మధ్య నడిచే సన్నివేశాలు, వైరుధ్యాలు కథకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఒక ఏరియా డాన్‌గా మోహన్‌బాబు పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండడంతో, హీరో నానిని డామినేట్ చేసేలా ఆయన పాత్ర ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
కథాంశం..
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కథ తిరుగుబాటు, నాయకత్వం అనే అంశాల చుట్టూ తిరుగుతుందని, తల్లీకొడుకుల అనుబంధం కథకు కీలకంగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఇది సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ , స్పానిష్‌తో సహా మొత్తం 8 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని, మోహన్‌బాబుల మొదటి స్క్రీన్ షేరింగ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.