- జూన్ 8న మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన సీటు
- అదే నెల చివర్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఇన్చార్జి బాధ్యతలు
- గల్లీ గల్లీ తిరుగుతూ.. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్న మంత్రి
- వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే అభివృద్ధి పనులపై ఫోకస్
- కాంగ్రెస్‌లో అసంతృప్తులను బుజ్జగించడంలోనూ కీలక పాత్ర
- ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు భరోసా ఇవ్వడంలో అధికార పార్టీ నేతలు సక్సెస్
- మొదట్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపు.. చివర్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపు!
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొదట్లో వెనుకబడిన కాంగ్రెస్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న తీరుపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ప్రారంభంలో సర్వేలన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నప్పటికీ చివర్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే విజయం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ 2023 ఎన్నికల్లో 35శాతం ఓట్లతో రెండోస్థానానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు విజయం దిశగా నడిపించడంలో ఇన్చార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు సక్సెస్అయ్యారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మైనారిటీలు, బీసీలు, మహిళలను కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కీలకపాత్ర పోషించారు. జూన్8న మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అదే నెల చివర్లో సీఎం రేవంత్.. మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎన్నికల ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. జులైలోనే రంగంలోకి దిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. తన తండ్రి కాకా వెంకటస్వామి కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలను కలుపుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
మూడు నెలల పాటు నియోజకవర్గంలో గల్లీగల్లీ తిరుగుతూ, ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యల్లో చాలావరకు అక్కడికక్కడే పరిష్కరించగలిగారు. మిగిలినవాటిని కూడా హామీలతో సరిపెట్టకుండా ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి అనేక అభివృద్ధి పనులను పూర్తిచేయించారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజల కష్టసుఖాల్లో తోడుంటామని సీఎం రేవంత్‌తోపాటు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఇచ్చిన భరోసా వల్లే జూబ్లీహిల్స్ ఎన్నికలో జనం అధికారపార్టీకి అండగా నిలిచారని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మైనారిటీలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో కీలకపాత్ర
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లలో మూడో వంతు ఉన్న మైనార్టీలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో మంత్రి వివేక్ కీలక పాత్ర పోషించారు. అప్పటి వరకు మెజార్టీ మైనార్టీలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 80,549 (43.94%) ఓట్లతో గెలుపొందగా.. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మహమ్మద్ అజారుద్దీన్ 64,212 (35.03%) ఓట్లతో రెండోస్థానానికి పరిమితయ్యారు.
ఇది గుర్తించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. నియోజకవర్గంలోని ముస్లింలతో ప్రత్యేకంగా సమావేశమై, వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేశారు. ముఖ్యంగా ముస్లింలకు ఎర్రగడ్డలో ఖబరస్తాన్ కోసం 2,500 గజాల స్థలం కేటాయించడం ద్వారా మైనారిటీలను ఆకర్షించగలిగారు. మహిళలు, ఆటోడ్రైవర్లు, ఎస్సీలు, బీసీల్లోని ఒక్కో సామాజికవర్గంతో సమావేశమవుతూ.. రెండేండ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సవివరంగా తెలియజేశారు.
మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్అమలు చేస్తున్నామని, రూ. 500కే గ్యాస్‌సిలిండర్ ఇస్తున్నామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని వివరించారు. ఇంకో వైపు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన తీరును ఎండగట్టారు. ఆ తర్వాత ప్రచార బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్లను, లోకల్ లీడర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు.
అండగా మరో ఇద్దరు మంత్రులు..
జులై చివర్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి మరో ఇద్దరు మంత్రులు తోడయ్యారు. తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ కు కూడా ఇన్చార్జ్ బాధ్యతలను సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఈ ఇద్దరు మంత్రులను సైతం వివేక్ సమన్వయం చేసుకుంటూ .. మూడుసార్లు బీఆర్ఎస్ గెలిచిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఏర్పడే ప్రయత్నం చేశారు.
మూడు నెలల కింద మంత్రి వివేక్ వేసిన పునాదులతో ఆ తర్వాత వచ్చిన ఇన్చార్జులకు మార్గం సుగమమైంది. ప్రచారాన్ని స్పీడప్ చేయడంలో భాగంగా ఎన్నికలకు నెల రోజుల ముందు సీఎం.. ఒక్కో డివిజన్ కు ఇద్దరు మంత్రులను ఇన్చార్జులుగా నియమించారు. బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న షేక్ పేట డివిజన్ ను మంత్రి వివేక్ కు అప్పగించారు.
ఆ డివిజన్లో రూ. 115 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించిన వివేక్.. ఎన్నికల నాటికే అందులో 70 శాతం పనులను పూర్తిచేయించగలిగారు. ఈ క్రమంలో ఈ నెల 5 న ఆ డివిజన్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి వివేక్ పనితీరును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రశంసించారు. ఇక్కడ వివేక్ వెంకటస్వామికి అభివృద్ధి పనుల బాధ్యత అప్పగించామని, ఆయన నిద్రాహారాలు లేకుండా తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తిచేశారని సీఎం కొనియాడారు.
ఇంకో వైపు మైనార్టీలను మద్దతు కోసం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇప్పించడంలో, పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయించడంలో వివేక్ కీలక పాత్ర పోషించారు. ఆయన సొంతగా సర్వేలు చేయిస్తూ జనం నాడిని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తూ వచ్చారు. ఆయన వ్యూహత్మక నిర్ణయాలకు సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు పక్కా అనే అనుకున్న వాతావరణం నుంచి కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే పరిస్థితికి తేగలిగారు.
వారం కింది వరకు బీఆర్ఎస్సే గెలుస్తుందని సర్వేలన్నీ కోడై కూయగా.. ఎన్నికలు ముగిసే సమయానికి కాంగ్రెస్అభ్యర్థే గెలుస్తాడనే దాకా వచ్చిందంటే అందులో వివేక్ వెంకటస్వామి పాత్ర మరువలేనిది. దీనిపై ఇటీవల పీసీసీ చీఫ్కూడా స్పందించారు. ‘‘వివేక్ వెంకటస్వామి మూడు నెలల నుంచి ఇక్కడ పని చేస్తున్నారు. ఆయన చాలా కమిటెడ్ లీడర్.. ఇంత క్రమశిక్షణ ఉన్న లీడర్‌ను నేను ఎక్కడా చూడలేదు’’ అంటూ మహేశ్ కుమార్‌గౌడ్ ప్రశంసించడం విశేషం.
బస్తీల్లో తిరుగుతూ.. సమస్యలు పరిష్కరిస్తూ..
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటికి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. పైగా బీఆర్ఎస్ పెద్దలు.. మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ఇవ్వడం ద్వారా సెంటిమెంట్, ప్రభుత్వ వ్యతిరేకతతో లబ్ధి పొందాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి .. మంత్రి వివేక్ వెంకటస్వామికి అప్పగించారు. జూన్ చివర్లో ఆయన ఒక్కరే కాంగ్రెస్ తరఫున ఎన్నికల ఇన్చార్జ్గా జూబ్లీహిల్స్నియోజకవర్గంలో కాలుమోపారు.
తన తండ్రి కాకా వెంకటస్వామి కార్మిక నేతగా అడుగులు వేసిన ప్రాంతం కావడంతో మంత్రి వివేక్ కు ఇక్కడి ప్రజలు ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనారిటీలతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. సన్నిహితుల అండతో నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్ పేటతో పాటు ఆయన నివాసం ఉండే సోమాజిగూడ డివిజన్ల పరిధిలోని బస్తీల్లోకి నేరుగా వెళ్లారు. గల్లీగల్లీ తిరుగుతూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకున్నారు.
జనాలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారు. ఏ పనులు కావాలి .. ఎంతవుతుందని లెక్కలేసుకుని ప్రభుత్వం నుంచి ఫండ్స్ మంజూరు చేయించారు. అవసరమైన అన్ని చోట్ల రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికలు, వాటి చుట్టూ ప్రహరీల నిర్మాణం చేపట్టారు. మీటింగుల మీద మీటింగులు పెట్టి కార్యకర్తలను ఏకం చేశారు. అసంతృప్త నేతలను కలుపుకుపోయారు. బీసీ బిడ్డ నవీన్యాదవ్ను ఎలాగైనా అసెంబ్లీకి పంపాలనే పట్టుదలతో పని చేశారు.
నిజానికి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారు చేయడంతో అప్పటివరకు తమకే టికెట్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్న ఆశావహులు ఒక్కసారిగా అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి లాంటివారు నారాజ్కావడంతో వారి ఇండ్లకు వెళ్లి పార్టీ తరపున భరోసా ఇచ్చి ప్రచారంలో పాల్గొనేలా చేయడంలో వివేక్ వెంకటస్వామి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి తో అటు పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ నేతలందరినీ ఒక్కతాటిపై నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు.
