
- నా వికెట్ విలువ తెలుసు కాబట్టే రెచ్చగొట్టాడు: సూర్య
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తనను స్లెడ్జింగ్ చేయడం సంతోషంగా అనిపించిందని ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ‘నేనే కాదు.. ప్రత్యర్థి ఎవరైనా సరే విరాట్ అలానే కఠినంగా ఉంటాడు. ఏదేమైనా కోహ్లీ నన్ను స్లెడ్జ్ చేయడం హ్యాపీగా అనిపించింది. నా వికెట్ విలువ తెలుసుకున్నందు వల్లే విరాట్ నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నేను క్రీజులో ఉంటే మా టీమ్ గెలుస్తుందని తనకీ తెలుసు. దాంతో నన్ను ఔట్ చేస్తే వాళ్లకి చాన్సు ఉంటుందని అలా చేసి ఉంటాడు. పిచ్ మీద నేను చాలా కూల్‌గా ఉంటా. స్లెడ్జింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటా. కానీ అబుదాబిలో ఆ రోజు పరిస్థితి వేరు. దాని వల్లే నువ్వా నేనా అన్నట్లు ప్రవర్తించాల్సి వచ్చింది. అదంతా ఆ కొంచెం సేపటి వరకే. మ్యాచ్ అయ్యాక అంతా మామూలే. కోహ్లీ కూడా బాగా ఆడావు అని నన్ను మెచ్చుకున్నాడు’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.
నా ఆట నేను ఆడా..
అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో తన డెబ్యూ టీ20లో క్రీజులోకి వచ్చేముందు చాలా టెన్షన్ ఫీలైనట్లు సూర్య వెల్లడించాడు. ‘బ్యాటింగ్ కోసం రెడీ అయ్యి డ్రెస్సింగ్‌రూమ్ నుంచి డగౌట్‌కు వచ్చేటప్పుడు కూడా చాలా టెన్షన్ ఫీలయ్యా. నేను అలా టెన్షన్ పడకపోయి ఉంటే బాగా పెర్ఫామ్ చేసేవాడ్ని కాదనుకుంటా. చివరికి క్రీజులోకి వెళుతుండగా..గతంలో మూడో ప్లేస్‌లో బ్యాటింగ్ చేసినప్పుడు ఏమేం చేశానో వాటిని గుర్తు చేసుకున్నా. దాంతో నేను నా ఆట ఆడాలని డిసైడయ్యా. కొత్తగా ఏం ట్రై చెయ్యకు.. నువ్వు నీలానే ఉండు అని మనసులో అనుకుని మోటివేట్అయ్యాను’ అని సూర్యకుమార్ గుర్తు చేసుకున్నాడు.