వట్టే జానయ్య భార్య రాజీనామా..తన భర్తను వేధిస్తున్నందుకు రిజైన్ చేశానని వెల్లడి

వట్టే జానయ్య భార్య రాజీనామా..తన భర్తను వేధిస్తున్నందుకు రిజైన్  చేశానని వెల్లడి

సూర్యాపేట, వెలుగు: బీసీలను అణచివేయాలన్న కుట్రతో తన భర్త వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నందుకు బీఆర్ఎస్​ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని 13వ వార్డు కౌన్సిలర్  వట్టే రేణుక తెలిపారు. శనివారం గాంధీనగర్ లోని తన ఇంట్లో బీఆర్ఎస్ పార్టీకి  100 మంది మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఆమె రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ లో బీసీలకు గౌరవం లేదని, సమస్యలను చెప్పుకుందామనుకున్నా అవమానిస్తున్నారని వాపోయారు. 

బీసీల సమస్యలపై మంత్రి జగదీశ్ రెడ్డికి విన్నవించుకునేందుకు వెళ్తే  సమయం కూడా ఇవ్వలేదన్నారు. బీసీల పక్షాన నిలబడతానని తన భర్త ప్రకటించిన రెండు రోజుల్లోనే ఆయనపై 71 కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు సూర్యాపేటలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మంత్రి జగదీశ్  రెడ్డికి గుణపాఠం చెప్తారన్నారు.  కౌన్సిలర్ అయిన తనకు  కౌన్సిల్ సమావేశాల సమాచారం ఇవ్వడం లేదని, వార్డులో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని తెలిపారు.