సూర్యాపేట/ తుంగతుర్తి, వెలుగు: మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగిద్దామని సూర్యాపేట కలెక్టర్ తేజేస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆజాద్ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన ఫొటోకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలోని విద్యాసంస్థల్లో నాణ్యతతో పాటు, అభ్యసన సామర్ధ్యాలను పెంచేందుకు అన్ని స్థాయిల్లో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, మైనార్టీ పెద్దలు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ తిరుమలగిరి మండలం తొండ, కోక్యతండా, కనిగిరి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లోని పలు రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత తిరుమలగిరి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో టెన్త్ స్కూడెంట్ల స్టడీ అవర్‌ను పరిశీలించారు. ఇష్టంతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో శాంతయ్యం తదితరులు పాల్గొన్నారు.
